TRS Plenary: మీరెందుకు గులాబీ చొక్కాలు వేసుకోలేదు?.. కొందరు నేతలతో కేటీఆర్
రెండు దశాబ్దాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న టీఆర్‌ఎస్ పార్టీ.. ద్విదశాబ్ది వేడుకలు ఘనంగా జరుపుకుంటుంది. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో టీఆర్‌ఎస్ పార్టీ ప్లీనరీ (TRS Plenary) నిర్వహణకు అంతా సిద్దమైంది.
రెండు దశాబ్దాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న టీఆర్‌ఎస్ పార్టీ.. ద్విదశాబ్ది వేడుకలు ఘనంగా జరుపుకుంటుంది. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో టీఆర్‌ఎస్ పార్టీ ప్లీనరీ (TRS Plenary) నిర్వహణకు అంతా సిద్దమైంది. కొద్దిసేపటి క్రితమే టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్లీనరీ సభా వేదిక వద్దకు చేరుకున్నారు. ఇప్పటికే టీఆర్‌ఎస్ పార్టీ ప్లీనరీలో పాల్గొనేందుకు ఆహ్వానించిన వేలాది మంది ప్రతినిధులు హైటెక్స్ చేరుకుంటున్నారు. ప్లీనరీ నేపథ్యంలో హైదరాబాద్‌లోని రోడ్లన్నీ గులాబీమయంగా మారాయి. ముఖ్యంగా హైటెక్స్ వైపు వెళ్లే మార్గాల్లో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పలు కూడళ్లలో సీఎం కేసీఆర్ ఫొటోలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. టీఆర్‌ఎస్ ప్లీనరీ నేపథ్యంలో పోలీసులు భారీగా భద్రత ఏర్పాటు చేశారు. హైటెక్స్ పరిసరాల్లో ఈ రోజు సాయంత్రం వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ఇక, కొద్దిసేపటి క్రితమే టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్లీనరీ సభా వేదిక వద్దకు చేరుకున్నారు. అయితే అక్కడ కొందరు నేతలు గులాబీ రంగు చొక్కా లేకుండా కనిపించారు. దీంతో కేటీఆర్ వారితో గులాబీ రంగు చొక్కాలెందుకు వేసుకోలేదని అడిగారు. గులాబి రంగు చొక్కా లేనివారికి వేదికపైకి అనుమతి లేదని చెప్పారు. దీంతో వారు అప్పటికప్పుడే గులాబీ చొక్కాలు ధరించారు. అయితే ప్లీనరీ హాజరయ్యే టీఆర్‌ఎస్ ప్రతినిధులందరూ గులాబీ డ్రెస్‌కోడ్‌ను పాటించాలని కేటీఆర్ సూచించిన సంగతి తెలిసిందే.
ప్లీనరీకి పార్టీ ప్రతినిధులు హాజరు అనంతరం అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ చేపట్టనున్నారు. మరోసారి టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ ఎన్నిక లాంఛనప్రాయం కానుంది. అధ్యక్ష స్థానానికి కేసీఆర్‌ను ప్రతిపాదిస్తూ 18 నామినేషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. పార్టీ అధ్యక్ష ఎన్నిక తర్వాత.. గత ఏడున్నరేళ్లలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం సాధించిన అభివృద్దిని కేసీఆర్ పార్టీ శ్రేణులకు వివరించనున్నారు.
టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్ని తానే భుజాన వేసుకుని ప్లీనరీ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పార్కింగ్ మొదలు, సభా వేదిక దాకా అన్నింటిని మంత్రి కేటీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ప్లీనరీ ఆవరణలో సీఎం కేసీఆర్ జీవితంలోని ముఖ్య ఘట్టాలతో పాటుగా, టీఆర్‌ఎస్ 20 ఏళ్ల ప్రస్తానంలోని కీలక ఘట్టలకు సంబంధించిన ఫొటో గ్యాలరీ ఏర్పాటు చేశారు. ప్లీనరీకి హాజరయ్యే పార్టీ శ్రేణులు, మీడియా ప్రతినిధులు, ఇతర సిబ్బంది కోసం పలు రకాల వంటకాలను సిద్దం చేశారు. ముఖ్యంగా శాఖాహార, మాంసాహార వంటకాలతో కూడిన మెనూ సిద్ధం చేశారు. చికెన్ దమ్ బిర్యానీ, మటన్ కర్రీ, నాటు కోడి పులుసు, ఎగ్‌మసాలా, నల్లపొడి ఫ్రై, మటన్ దాల్చా, బోటీ ఫ్రై, పాయా సూప్, తలకాయ పులుసు వంటి నాన్‌వెజ్ వంటకాలు మెనూలో ఉన్నాయి.