హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న తెలంగాణ ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గినట్లు ఉంది. సమ్మె విడిచి చర్చలకు రావాలంటూ టీఆర్ఎస్ పార్టీ అగ్రనేత, రాజ్యసభ సభ్యుడు కేకే ఆహ్వానించారు. 

సమ్మె వల్ల ఇబ్బందులే తప్ప ఎలాంటి లాభం లేదని చెప్పుకొచ్చారు. ఆర్టీసీ కార్మికులతో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు ఎంపీ కేకే. గతంలో కార్మికుల సమస్యలను పరిష్కరించిన విషయాన్ని కేకే స్పష్టం చేశారు. 

ఆర్టీసీ విలీనం తప్ప మిగిలిన డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం పరిశీలించాలని కేకే సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేసినట్లు తెలిపారు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు కేసీఆర్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు తెలిపారు.

ప్రైవేట్ స్టేజ్ క్యారేజీలు, అద్దెబస్సులు సమ్మె వల్లనే నిర్ణయమని కేకే చెప్పుకొచ్చారు. గతంలో కార్మికుల సమస్యలను టీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పగా పరిష్కరించిందన్నారు. 44 శాతం ఫిట్ మెంట్, 16 శాతం ఐఆర్ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దేనని చెప్పుకొచ్చారు. ఆర్టీసీ విలీనానికి సంబంధించి టీఆర్ఎస్ మేనిఫెస్టోలో పొందుపరచలేదన్నారు కేకే. 

ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు తనను బాధించాయని ఆత్మహత్య ఏ సమస్యకు కూడా పరిష్కారం చూపదని ఎంపీ కేకే పత్రిక ప్రకటన విడుదల చేశారు. పరిస్థితులు చేయిదాటక ముందే ఆర్టీసీ యూనియన్ నేతలు కార్మికులను సమ్మె విరమింపజేసి చర్చలకు సిద్ధం కావాలని కోరారు. 

ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేయడమంటే తమ విధానాన్ని మార్చుకోవాలని కోరడమేనని కేకే అభిప్రాయపడ్డారు. ఇది ఆర్టీసీ యూనియన్లకు సంబంధం లేని విషయమని కేకే వ్యాఖ్యానించారు.  
 
ఇక అద్దె బస్సులు, ప్రైవేట్ స్టేజీ క్యారేజీల విషయంలో కేసీఆర్‌ చేసిన ప్రకటనను ప్రస్తుత సమ్మె నేపథ్యంలో తీసుకున్న నిర్ణయంగా మాత్రమే చూడాలని విఙ్ఞప్తి చేశారు. ఇకపోతే ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ 10 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఇప్పటికే ఇద్దరు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.