పార్లమెంట్ (parliament) ఉభయ సభల నుంచి టీఆర్‌ఎస్ ఎంపీలు (TRS MP) సోమవారం వాకౌట్ చేశారు. రైతుల పట్ల కేంద్రం మొండి వైఖరికి నిరసగా వాకౌట్ చేసినట్టుగా ఎంపీలు తెలిపారు. 

పార్లమెంట్ (parliament) ఉభయ సభల నుంచి టీఆర్‌ఎస్ ఎంపీలు (TRS MP) సోమవారం వాకౌట్ చేశారు. రైతుల పట్ల కేంద్రం మొండి వైఖరికి నిరసగా వాకౌట్ చేసినట్టుగా ఎంపీలు తెలిపారు. నేడు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే.. టీఆర్‌ఎస్ ఎంపీలు లోక్‌సభలో నిరసనకు దిగారు. స్పీకర్ చుట్టుముట్టి నినాదాలు చేశారు. రైతుల్ని కాపాడాలంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. సమగ్ర జాతీయ ధాన్య సేకరణ విధానం తీసుకు రావాలని టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. కేంద్రం ధాన్యం కొనుగోలుపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. రబీ ధాన్యం సేకరణ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ క్రమంలోనే ఉభయ సభల నుంచి టీఆర్‌ఎస్ ఎంపీలు వాకౌట్ చేశారు.

ఇక, తెలంగాణలో ధాన్యం కొనుగోలు‌పై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ వారం రోజులుగా టీఆర్‌ఎస్ ఎంపీలు పార్లమెంట్ లోపల, వెలుపల నిరసన తెలుపుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రైతుల జీవితాలను నాశనం చేయవద్దని ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ.. నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం తెలంగాణపై వివక్ష చూపెడుతుందని వారు ఆరోపిస్తున్నారు.

ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం టీఆర్‌ఎస్ ఎంపీల ప్రశ్నలకు రాజ్యసభలో సమాధానమిచ్చిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్.. వరి ధాన్యం కొనుగోలు విషయమై తెలంగాణ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని విమర్శించారు. వరి ధాన్యం కొనుగోలు విషయమై రాష్ట్ర ప్రభుత్వం చేసుకొన్న ఎంఓయూ ఆధారంగా కొనుగోళ్లు చేస్తామని ఆయన చెప్పారు. ప్రతి విషయంలోనూ తెలంగాణ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.ఖరీఫ్ సీజన్ ద్వారా యాసంగిలో ధాన్యం కొనుగోలు విషయమై ఆలోచిద్దామని మంత్రి రాజ్యసభలో తేల్చి చెప్పారు.అన్ని రాష్ట్రాలతో వరి ధాన్యం కొనుగోలు విషయమై ఎంఓయూలు చేసుకొంటామని ఆయన గుర్తు చేశారు. దీని ప్రకారంగానే తాము ధాన్యం కొనుగోలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. బాయిల్డ్ రైస్ ఇవ్వమని గతంలోనే తెలంగాణ ప్రభుత్వం తమకు లేఖ ఇచ్చిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గుర్తు చేశారు. గతంలో లేఖ ఇచ్చి ఇప్పుడు బాయిల్డ్ రైస్ కొనాలని కోరడం సరైంది కాదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. ఈ సీజన్ లో ఇస్తామన్న ధాన్యం కూడా ఇంకా ఇవ్వలేదన్నారు. ఇంకా 29 లక్షల ధాన్యం పెండింగ్ లో ఉందని కేంద్ర మంత్రి తెలిపారు. వరి లెక్కలను తెలంగాణ ప్రభుత్వం సరిగా నిర్వహించడం లేదని ఆయన విమర్శించారు.

అయితే.. రైతుల సమస్యలను రాజకీయాలతో ముడిపెట్టకూడదని టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు (K Keshava Rao) అన్నారు. ధాన్యం కొనుగోళ్లపై పార్లమెంటులో కేంద్రం విధాన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో వరి రైతుల సమస్య పరిష్కారం కోసం తాము పాటు పడుతుంటే, బీజేపీ నేతలు రాజకీయాల గురించి మాట్లాడుతున్నారని, ఇది రాజకీయాలు మాట్లాడాల్సిన సమయం కాదని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే కేంద్రంపై పోరును మరింత ఉధృతం చేయాలని టీఆర్‌ఎస్ ఎంపీలు భావిస్తున్నారు.