విభజన చట్టంలోని 13వ షెడ్యూల్‌లో తెలంగాణ రాష్ట్రంలో  జాతీయ రహదారుల విస్తీర్ణాన్ని పెంచాలని సూచించారని వినోద్ తెలిపారు. దీనిని అనుసరించి 2014లో కేసీఆర్ ఆధ్వర్యంలో ఎంపీలందరితో కలిసి ప్రధాని మోడీ, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీలను కలిశామన్నారు.

రాష్ట్రంలో 1385 కిలోమీటర్ల రహదారులను జాతీయ రహదారులుగా గుర్తిస్తూ కేంద్రప్రభుత్వం తెలిపిందని, కానీ అందుకు సంబంధించి ఇంత వరకు అధికారికంగా జీవో విడుదల చేయలేదని వినోద్ అన్నారు. హైదరాబాద్ మహానగరంగా అభివృద్ధి చెందుతున్నందున దృష్ట్యా నగరానికి దూరంగా మరో రీజనల్ రింగ్ రోడ్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరామన్నారు.

దీనికి స్పందించిన కేంద్రం నిధులు, భూసేకరణ అంశాల్లో చెరిసగం పంచుకోవాలని రాష్ట్రప్రభుత్వాన్ని కోరిందని గుర్తు చేశారు. 1767 కిలోమీటర్ల రోడ్లకు సంబంధించిన డీపీఆర్‌లను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమర్పించిందన్నారు. నిన్న ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రహదారులకు శంకుస్థాపన చేయడంతో పాటు మరో లక్ష కోట్ల విలువైన కొత్త రహదారులను ప్రకటించారని కానీ తెలంగాణ విజ్ఞప్తులను పట్టించుకోలేదని వినోద్ ఎద్దేవా చేశారు.