పార్లమెంట్ సాక్షిగా కేంద్రం పచ్చి అబద్దాలు చెబుతుందని టీఆర్‌ఎస్ ఎంపీలు ఆరోపించారు. గిరిజ‌నుల రిజ‌ర్వేష‌న్లు పెంచాల‌ని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం పంప‌లేద‌ని కేంద్ర గిరిజ‌న శాఖ స‌హాయ మంత్రి బిశ్వేశ్వ‌ర్ తుడు (Bishweswar Tudu) అబద్దాలు ఆడి.. పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించారని విమర్శించారు.

పార్లమెంట్ సాక్షిగా కేంద్రం పచ్చి అబద్దాలు చెబుతుందని టీఆర్‌ఎస్ ఎంపీలు ఆరోపించారు. గిరిజ‌నుల రిజ‌ర్వేష‌న్లు పెంచాల‌ని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం పంప‌లేద‌ని కేంద్ర గిరిజ‌న శాఖ స‌హాయ మంత్రి బిశ్వేశ్వ‌ర్ తుడు (Bishweswar Tudu) అబద్దాలు ఆడి.. పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించారని అన్నారు. ఈ క్రమంలోనే నేడు కేంద్ర మంత్రి బిశ్వేశ్వ‌ర్ తుడుపై టీఆర్ఎస్ ఎంపీలు లోక్‌స‌భ‌లో ప్రివిలేజ్ నోటీసు (privilege motion) ఇచ్చారు. కేంద్రం తీరుకు నిర‌స‌న‌గా ఎంపీలు ఇవాళ లోక్‌స‌భ‌లో ఆందోళ‌న చేప‌ట్టారు. గిరిజ‌నుల రిజ‌ర్వేష‌న్లు పెంచాల‌ని టీఆర్ఎస్ ఎంపీలు నినాదాలు చేశారు. పార్లమెంట్‌ను త‌ప్పుదోవ ప‌ట్టించిన బిశ్వేశ్వ‌ర్‌ను కేబినెట్ నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌న్నారు.

ఈ క్రమంలోనే టీఆర్‌ఎస్ ఎంపీలు లోక్‌సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం టీఆర్‌ఎస్ ఎంపీలు కే కేశవరావు, నామా నాగేశ్వరరావు మీడియాతో మాట్టాడారు. ఎస్టీ రిజర్వేషన్ పెంపుపై 2017లోనే తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం జరిగిందన్నారు. అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని వెంటనే కేంద్ర హోం శాఖకు పంపడం జరిగిందని తెలిపారు. తాము కేంద్రానికి పంపింది ప్రతిపాదన కాదని.. అసెంబ్లీలో తీర్మానం చేసిన బిల్లు అని చెప్పారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాలని కేంద్రాన్ని కోరినట్టుగా తెలిపారు. ఎస్టీల రిజర్వేషన్‌ను 6 నుంచి 10 శాతానికి పెంచాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశామన్నారు. 

ఐదేళ్లుగా ఆ బిల్లు గురించి పార్లమెంట్‌లో ప్రస్తావిస్తున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్ ఎన్నోసార్లు ప్రధాని మోదీకి లేఖలు కూడా రాశారని చెప్పారు. ఎన్నిసార్లు అడిగినా ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై కేంద్రం నిర్ణయం తీసుకోలేదన్నారు. తెలంగాణ నుంచి ప్రతిపాదన రాలేదని కేంద్రం ఇప్పుడు కేంద్రం చెప్పడం దారుణమన్నారు. 

కేంద్రంలోని బీజేపీకి తెలంగాణపై చాలా అక్కసు ఉందని టీఆర్ఎస్ ఎంపీలు అన్నారు. ఎస్టీ రిజర్వేషన్‌లు సాధించే వరకు పోరాడతామని చెప్పారు.కేంద్ర మంత్రి ఉద్దేశపూర్వకంగానే పార్లమెంట్ సాక్షిగా అబద్దాలు చెప్పారని అన్నారు. కేంద్ర మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గిరిజనుల రిజర్వేషన్ల బిల్లును వెంటనే ఆమోదించాలని కోరారు.