దర్యాప్తు సంస్థలను విపక్షాలపై ప్రయోగిస్తుంది: కేంద్రంపై టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు
విపక్షాలపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తుందని టీఆర్ఎస్ ఎంపీ కె.కేశవరావు ఆరోపించారు.
ప్రజా సమస్యలపై చర్చకు 50 శాతం సమయాన్ని కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు
న్యూఢిల్లీ: పార్లమెంట్ లో 50 శాతం సమయాన్ని ప్రజా సమస్యలపై చర్చకు కేటాయించాలని టీఆర్ఎస్ ఎంపీ కె.కేశవరావు డిమాండ్ చేశారు.మంగళవారంనాడు న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు.పార్లమెంట్ లో ప్రజల వాయిస్ కు అవకాశం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. విపక్షాలపై దర్యాప్తు సంస్థలతో కేంద్రం దాడులు చేయిస్తుందని కేశవరావు ఆరోపించారు. దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తుందన్నారు. ప్రతిపక్షాలు దొంగలు, తాము మంచివాళ్లమనేలా కేంద్ర పెద్దలు మాట్లాడుతున్నారన్నారు.
ఈ పార్లమెంట్ సమావేశాల్లోబొగ్గు కేటాయింపులపై చర్చ జరగాలని ఆయన కోరారు. జీ 20 సదస్సు నిర్వహించడం గొప్పకాదన్నారు.రేపటినుండి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ నిన్న పార్టీ ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో ప్రజా సమస్యలపై కేంద్రాన్ని నిలదీయాలని కేసీఆర్ పార్టీ ఎంపీలను ఆదేశించారు. రాష్ట్రానికి కేంద్రం నుండి రావాల్సిన నిధులపై పట్టుబట్టాలని కేసీఆర్ సూచించారు. విభజన సమస్యలపై ఇచ్చిన హామీలను అమలుపై ఒత్తిడి తీసుకురావాలని పార్టీ ఎంపీలకు కేసీఆర్ సూచించారు.కేంద్రం ప్రభుత్వం అనుసరించిన విధానాల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని కోల్పోయింది. ఈ విషయంపై పార్లమెంట్ లో లేవనెత్తాలని కూడా టీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది.