హైదరాబాద్: శాసన మండలిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు తప్పు పట్టారు. ఎపీ శాసన మండలిని రద్దు చేయడం, మండలిపై రూపాయి ఖర్చుచేసినా దండగేనని వైయఎస్ జగన్ అనడంపై ఆయన స్పందించారు. 

ఏపీ శాసన మండలి రద్దు నిర్ణయం సరైంది కాదని ఆయన అన్నారు. మండలిపై ఖర్చు వృధా వ్యయమని జగన్ అనడం నాన్సెన్స్ అని ఆయన వ్యాఖ్యానించారు. పెద్దల సభ ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. మంగళవారంనాడు ఆనయ హైదరాబాదులో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఏస్ఈసీ) కమిషనర్ నాగిరెడ్డిని కలిశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. 

సాధారణంగా రాష్ట్రాలు చేసిన తీర్మానాలను కేంద్రం అమలు చేస్తుందని, అవసరమైతే అమలుకు ఎక్కువ సమయం తీసుకోవచ్చునని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దుకు వైఎస్ జగన్ ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపించడంపై ఆయన ఆ విధంగా అన్నారు. 

తుక్కుగుడా మున్సిపాలిటీలో ఆయన ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఓటేశారు తనపై కాంగ్రెసు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఆనయ కమిషనర్ ను కలిశారు .నేరేడుచర్లలో కేవీపీ రామచందర్ రావుకు ఓటు హక్కు కల్పించడంపై ఆయన అభ్యంతరం తెలియజేశారు 

తాను తప్పు ఓటేశానని అనడం సరికాదని, వాస్తవాలను అన్నింటినీ ఎస్ఈసీ దృష్టికి తీసుకుని వెళ్లానని ఆయన చెప్పారు. పరస్పరం రాష్ట్రాలు మార్చుకుంటూ తాను, కేవీపీ లేఖలు ఇచ్చామని, అప్పటి కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆదేశాలు కూడా ఇచ్చారని, 2014లోనే గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ అయిందని ఆయన స్పష్టం చేశారు. 

కేవీపీకి తెలంగాణలో సాధారణ ఓటు హక్కు కూడా లేదని, ఇద్దరికి ఓటు హక్కు ఇవ్వడం సరి కాదని ఆయన అన్నారు. తాను ఎలాగూ ఓటేశానని ఆయన చెప్పారు. కేవీపీకి ఓటు హక్కు ఇవ్వడంవో తప్పు జరిగిందని తాను ఎలా చెబుతానని ఆయన అన్నారు. అది ఎన్నికల సంఘం చూసుకోవాలని కేకే అన్నారు.