హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశిస్తే ఆర్టీసీ జేఏసీ నేతలతో తాను చర్చిస్తానని స్పష్టం చేశారు టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత, టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కేశవరావు. తాను సీనియర్ రాజకీయ నేతను కావడంతోనే సమ్మెపై సొంతంగా స్పందించానని చెప్పుకొచ్చారు. 

సమ్మె విరమించి చర్చకు రావాలని ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేస్తూ విడుదల చేసిన ప్రకటన కేవలం తన వ్యక్తిగతమని చెప్పుకొచ్చారు. ఆర్టీసీ సమ్మెతో అందరూ నష్టపోతున్నారని మనస్తాపంతో ఆర్టీసీ కార్మికులు ఆత్మబలిదానాలకు పాల్పడటం కలచివేయడంతో ప్రకటన విడుదల చేసినట్లు తెలిపారు. 

అయితే కేకే ప్రకటన వెనుక సీఎం కేసీఆర్ ఉన్నారంటూ ప్రచారం జరుగుతుంది. ఆర్టీసీ సమ్మె ప్రభావం ప్రభుత్వంపై పెద్ద ఎత్తున పడటంతో సమ్మకు ఒక ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ నుంచి కేకేకు సంకేతాలు అందాయని అందువల్లే నేరుగా ఆయన రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. 

కేకే రాయబారంపై ఈరోజు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. కేకే రాయబారంపై అటు ఆర్టీసీ జేఏసీ నేతలు సైతం సానుకూలంగా ఉన్నారని తెలుస్తోంది. అయితే సమ్మె విడిచి చర్చలకు రావాలన్న కేకే విజ్ఞప్తిని మాత్రం తిరస్కరిస్తున్నట్లు తెలుస్తోంది. సమ్మె కొనసాగుతుండగానే చర్చలకు హాజరవుతామని జేఏసీ నేతలు స్పష్టం చేస్తున్నారు. 

మెుత్తానికి సాయంత్రానికి కేకే రాయబారం, ఆర్టీసీ సమ్మె పరిష్కారం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కేసీఆర్ నుంచి కేకేకు ఆదేశాలు అందితే సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది.