జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీసీ, మైనారిటీలకు కలిపి 108 మందికి కార్పోరేటర్లుగా టికెట్లు ఇచ్చామని ప్రకటించారు టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కే. కేశవరావు.

శుక్రవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఇప్పటి వరకు తాను ఎన్నో పార్టీలకు అధ్యక్షుడిగా వున్నానని.. కానీ ఎప్పుడు ఈ తీరుగా 75 శాతం టికెట్లు బీసీ, మైనార్టీలక ఇవ్వడం చూడలేదన్నారు.

ఎస్టీలకు 2 సీట్లు రిజర్వేషన్ జరిగితే.. తాము మూడు సీట్లు ఇచ్చామని కేకే తెలిపారు. ఎస్సీలకు పది సీట్లు రిజర్వ్ అయితే తాము 11 మందికి టికెట్లు కేటాయించామన్నారు.

అట్టడుగున వున్న వారు పైకి రావాలంటే ఇలాంటి ఎన్నికల్లో పోటీ చేయాలని కేశవరావు అన్నారు. రిజర్వేషన్ల ప్రకారం మహిళలకు 75 సీట్లు కేటాయించాలని.. కానీ టీఆర్ఎస్ 85 మందికి టికెట్లు ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు.

ధనిక, పేద తేడా లేకుండా అందరికీ వరద సాయం అందజేశామని.. ఇది తప్పా అని కేశవరావు నిలదీశారు. దీనిని చూసి ఓర్వలేకో, ఎన్నికల్లో నష్టపోతామనే భయంతోనో కొన్ని శక్తులు వరద సాయాన్ని నిలిపివేసేందుకు ప్రయత్నించాయని కేకే మండిపడ్డారు.

అయినప్పటికీ ఎన్నికల ఫలితాల తర్వాతైనా టీఆర్ఎస్ ప్రభుత్వం.. ఈ సాయాన్ని ప్రజలకు ఇచ్చి తీరుతుందని కేశవరావు తేల్చి చెప్పారు.