ఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. లోక్ సభ టీఆర్ఎస్ పక్ష నేత జితేందర్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. 2019 ఎన్నికలకు సంబంధించి ఆయనకు టీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. 

అయితే జితేందర్ రెడ్డితో బీజేపీ జాతీయ నేత రాంమాధవ్ సంప్రదింపులు జరుపుతున్నారు. ఇటీవలే ఆయనను స్వయంగా కలిశారు కూడా. బుధవారం సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆధ్వర్యంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. 

తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఆయన టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారని సీఎం కేసీఆర్ కు ఫిర్యాదులు వెళ్లాయి. అంతేకాదు ఎంపీ అభ్యర్థి ఎంపికకు సంబంధించి మహబూబ్ నగర్ ఎమ్మెల్యేలతో సమావేశం కాగా ఏడుగురు ఎమ్మెల్యేలు జితేందర్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. 

ఆయనకు టికెట్ ఇస్తే సహకరించేది లేదని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో తమ ఓటమికి జితేందర్ రెడ్డి పనిచేశారని వారంతా సీఎం కేసీఆర్ కు మెురపెట్టుకున్నారు. దీంతో ఆయనకు టికెట్ ఇవ్వలేదు గులాబీ బాస్ కేసీఆర్. 

మహబూబ్ నగర్ జిల్లాలో కీలక నేత అయిన మాజీ మంత్రి డీకే అరుణ సైతం ఇటీవలే బీజేపీలో చేరారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇకపోతే జితేందర్ రెడ్డి గతంలో బీజేపీ తరపున ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. దీంతో ఆయన సొంతగూటికి చేరుకున్నట్లయ్యింది. జితేందర్ రెడ్డికి రాజ్యసభ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.