ఢిల్లీ: ఈబీసీ రిజర్వేషన్ బిల్లుకు టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ ఎంపీ జితేందర్ రెడ్డి స్పష్టం చేశారు. పార్లమెంట్ లో ఈబీసీ బిల్లుపై జరిగిన చర్చలో టీఆర్ఎస్ మద్దతు ప్రకటించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈబీసీ బిల్లును స్వాగతించారని ప్రకటించారు. 

బలమైన సమాజ నిర్మాణం కోసం జరిగే ప్రతి ప్రయత్నాన్ని టీఆర్‌ఎస్‌ స్వాగతిస్తుందని ఎంపీ చెప్పారు. సమాజంలో వెనుకబాటుతనానికి ప్రభుత్వాలే కారణమని, ఇప్పటి వరకు ఉన్న ఏ ప్రభుత్వం కూడా సామాన్యుడి గురించి ఆలోచించలేదని జితేందర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 

ఆలస్యం అయినా ఈ బిల్లు ద్వారా అగ్రవర్ణాలలోని ఆర్థికంగా వెనుకబడిన వారికి ఎంతో న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. అగ్రవర్ణాలలోని విద్య, ఉద్యోగ అవకాశాల్లో పది శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆమోదయోగ్యమైందన్నారు.  

అయితే కేంద్రం పార్లమెంట్ లో ప్రవేశపెట్టే ఈబీసీ రిజర్వేషన్ల బిల్లులో సవరణలు చెయ్యాల్సి ఉందన్నారు. విభజన తర్వాత తెలంగాణ అభివృద్ధిలో ముందుకెళ్తోందని, తెలంగాణలో 12 శాతం ముస్లిం మైనార్టీలున్నారని జితేందర్‌రెడ్డి లోక్‌సభలో వ్యాఖ్యానించారు. 

తెలంగాణ ముస్లింలలో వెనుకబడిన వారికి 12 శాతం, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని అయితే ఇప్పటి వరకు కేంద్రం స్పందించలేదని జితేందర్ రెడ్డి గుర్తు చేశారు. 

రాష్ట్ర ప్రభుత్వం పంపిన తీర్మానాలను కేంద్రం ఆమోదించాలని కోరారు. తమిళనాడులో ఎలా అయితే 69శాతం రిజర్వేషన్లు అమలు అవుతున్నాయో అదేవిధంగా తెలంగాణలో కూడా అమలయ్యేలా చొరవ చూపాలని ఎంపీ జితేందర్ రెడ్డి కోరారు. 

ఈ వార్తలు కూడా చదవండి

కాపు కోటాను మళ్లీ తెరపైకి తెచ్చిన చంద్రబాబు: ఈబీసి రిజర్వేషన్ల బిల్లుపై వ్యాఖ్య