వరంగల్: ఒక ప్రజాప్రతినిధికి రక్షణ కల్పించాల్సిన సెక్యూరిటీ సిబ్బంది ఒక ప్రైవేట్ వ్యక్తికి సెక్యూరిటీకి సెక్యూరిటీ ఇస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజ్యసభ సభ్యుడికి రక్షణగా ఉండాల్సింది పోయి ఒక ప్రైవేట్ వ్యక్తితో సరదాగా ఉంటున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 

వివరాల్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్ హుజూర్ నగర్ ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొని పులించింతల ప్రాజెక్టు సందర్శనకు వెళ్లారు. ఎంపీ ప్రకాష్ వెంట జగన్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. ఎంపీ ప్రకాష్ ప్రాజెక్టు సమీపంలో ఉన్న మత్స్యకారులతో మాట్లాడుతున్నారు. ఆ సమయంలో ఎంపీ వెంట ఉండాల్సిన సెక్యూరిటీ అక్కడ నుంచి తప్పించుకున్నారు. 

ఎంపీ వెంట వచ్చిన ప్రైవేట్ వ్యక్తి జగన్ అనే వ్యక్తి వెంట పక్కకు వచ్చేశారు. అసలే ప్రాజెక్టు ఏరియా బాగుందేమో ఆ ప్రైవేట్ వ్యక్తి ఏకంగా వారితో ఒక వీడియో కూడా తీసేశారు. ఆయనేదో ప్రజాప్రతినిధిగా ఎంపీ సెక్యూరిటీ గార్డులు తనకు సెక్యూరిటీ కల్పిస్తున్నట్లు వీడియోలో బిల్డప్ ఇచ్చాడు. అక్కడితో ఆగిపోకుండా ఆవీడియోను ఏకంగా సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. 

ఈ వ్యవహారం కాస్త సదరు ఎంపీ బండ ప్రకాష్ కు తెలిసింది. దాంతో ఆ ప్రైవేట్ వ్యక్తిని, సెక్యూరిటీ సిబ్బందిని మందలించారు. ఇకపోతే ఎంపీకి రక్షణ కల్పించాల్సిందిపోయి ప్రైవేట్ వ్యక్తితో వీడియో షూట్ లో పాల్గొంటారా అంటూ నెటిజన్లు ఎంపీ సెక్యూరిటీపై విరుచుకుపడుతున్నారు.