హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎంపీ బాల్కసుమన్ నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి ఓ విషపురుగు అని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను భ్రష్టుపట్టించిన వ్యక్తి రేవంత్ రెడ్డి అన్నారు. ఐటీ దాడులపై దమ్ముంటే విచారణ ఎదుర్కోవాలని అంతేకానీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరించారు. 

మరోవైపు రేవంత్ రెడ్డి ఎవరెవరిని మోసం చేశారో అందరికీ తెలుసునన్నారు. రేవంత్ రెడ్డి భండారం మెుత్తం తనకు తెలుసునన్నారు. ఐటీదాడులలో కేసీఆర్‌ హస్తముందన్న రేవంత్ వ్యాఖ్యలను సుమన్ ఖండిచారు.

కేసీఆర్ తనను ఎదుర్కొనేందుకు ఏసీబీని ప్రయోగించారని, కేసీఆర్‌ కులాల మధ్య పోరుగా చిత్రీకరిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అండమాన్‌ జైల్లో పెట్టినా కేసీఆర్‌పై పోరాటం సాగిస్తానని, కేసీఆర్‌ అవినీతిపై తెలంగాణ మొత్తం ప్రచారం చేస్తానని అన్నారు.

రేవంత్‌రెడ్డిని అరెస్టు చేసి కనీసం నాలుగు నెలలైనా జైల్లో పెట్టాలని అనుకున్నారని, ఇలా ప్లాన్‌ చేసేది కేసీఆర్ అయితే దాన్ని అమలు చేసేది మోడీ అని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్‌ కుటుంబం చేతిలో బందీగా ఉందని రేవంత్ రెడ్డి అన్నారు.