సూర్యాపేట: తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై నిప్పులు చెరిగారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. సార్వత్రిక ఎన్నికల్లో అబద్దాలు చెప్పి ఉత్తమ్ గెలిచారని ఆరోపించారు. హుజూర్ నగర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పల్లా కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి బ్లాక్‌మెల్‌ రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ్ పచ్చి అబద్దాల కోరు అని మోసగాడు అంటూ తిట్టిపోశారు. నిత్యం అబద్దాలతో ప్రజలను మభ్యపెడుతున్నారంటూ విమర్శించారు. 

హుజూర్‌ నగర్‌ ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఓడగొట్టే శక్తి ఎవరికి లేదని చెప్పుకొచ్చారు. ఉప ఎన్నికల్లో గెలుపు టీఆర్‌ఎస్‌దేనని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి 40వేల మెజార్టీతో గెలుస్తారన్నారు. హుజూర్‌నగర్‌లో గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. 

సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని, కేంద్ర మంత్రిని అవుతానంటూ ప్రజలను మభ్యపెట్టి ఉత్తమ్‌ ఎంపీగా గెలిచారని ఆరోపించారు. హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గానికి చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు.  

నిజాయితీ, నిబద్దతతో పనిచేసే టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టీఆర్‌ఎస్‌ గెలుపుతో నియోజకవర్గ దశ మారుతుందని, అభివృద్ధికి ముఖద్వారంగా హుజూర్‌నగర్‌ను నిలుపుతామని పల్లా రాజేశ్వర్ రెడ్డి హామీ ఇచ్చారు.