ఇవాళ (గురువారం) ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన, ముఖ్యమంత్రి కేసీఆర్ కర్ణాటక పర్యటనతో ఒక్కసారిగా రాజకీయ వేడి పెరిగింది. హైదరాబాద్ కు విచ్చేసిన ప్రధాని టీఆర్ఎస్ ప్రభుత్వంపై చేసిన విమర్శలను ఎమ్మెల్సీ పల్లా తిప్పికొట్టే ప్రయత్నం చేసారు. 

హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు విచ్చేసిన ప్రధానమంత్ర నరేంద్ర మోదీ (narendra modi) తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) పై చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి (palla rajeshwar reddy) కౌంటరిచ్చారు. దేశ ప్రధాని రాష్ట్రానికి వచ్చి ఇచ్చిందేమీ లేకపోగా తెలంగాణపైనే విషం కక్కి వెళ్లిపోయారని అన్నారు. ప్రధాని హోదాలో ఉండి అబద్దాలు చెప్పారన్నారు. తెలంగాణకు ఒక్క సంస్థను ఇవ్వకుండా అన్యాయం చేశారని... మెడికల్ కాలేజీ, నవోదయ స్కూల్స్ ఎందుకు ఇవ్వలేదని పల్లా ప్రశ్నించారు. 

తెలంగాణ ఐటీఐఆర్ ను రద్దు చేసిన చరిత్ర మోడీది అని మండిపడ్డారు. తెలంగాణకు చెందిన ఏడు మండలాలను ఏపీ లో కలిపి ఇబ్బంది పెట్టారన్నారు. ప్రభుత్వ సంస్థలను మోడీ అమ్మేయడమే కాదు లక్షల కోట్ల అప్పులు చేసి భారం మోపుతున్నారని ఆరోపించారు. వృద్ధిలో, తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ వన్ గా వుందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలను తెలంగాణ సాకుతోందని పల్లా పేర్కొన్నారు. 

Video

కొత్త రాష్ట్రం కాబట్టి అవసరాలకు అనుగుణంగా కొత్త సచివాలయాన్ని కట్టుకుంటున్నామని పల్లా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ది మూడనమ్మకమే అయితే కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనం కూడా మూడనమ్మకమేనా? అని ప్రధానిని ప్రశ్నించారు పల్లా. 

తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరుల ఆశయాలను తెలంగాణ ప్రభుత్వం నెరవేర్చిందని పేర్కొన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలి... అలాకాకుండా కేవలం రాజకీయ లబ్ది కోసమే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్ ను విమర్శించడం తగదని ఎమ్మెల్సీ పల్లా పేర్కొన్నారు. 

తెలంగాణ రాష్ట్ర ఆశయాల్లో ఒకటయిన ఉద్యోగ నియామకాలను కేసీఆర్ ప్రభుత్వం చేపడుతోందని పల్లా పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో లక్షా 31 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ పూర్తయిందని... ఇంకా లక్షమందికి ఉద్యోగాలివ్వడానికి సిద్దంగా వున్నామన్నారు. ఇక మూడు లక్షలకు పైగా ఉద్యోగాలు ఐటీ రంగంలో, 17 లక్షలకు పైగా ఉద్యోగాలు ప్రైవేట్ ఇండస్ట్రీస్ కల్పించామన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలోనే నిరుద్యోగిత తగ్గిందని కేంద్రమే చెబుతూ అవార్డులు ఇస్తోందని పల్లా గుర్తుచేసారు. 

టెక్నాలజీని మీకంటే ఎక్కువగా ఉపయోగించేది సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ సర్కార్ అని ప్రధానికి కౌంటరిచ్చారు. కేసీఆర్ ఏది కట్టినా, ఏది పెట్టినా సంపద సృష్టించడానికేనని అన్నారు. 2024లో జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మళ్లీ జయకేతనం ఎగరవేసి హ్యాట్రిక్ సాధిస్తుందన్నారు. అంతేకాదు కేంద్రంలో కూడా బిజెపిని ఓడిస్తామని, ప్రధాని మోదీని ఇంటికి పంపడం ఖాయమని పల్లా రాజేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. 

ఇదిలావుంటే 21వ శతాబ్దంలోనూ కొందరు మూఢనమ్మకాలను పాటిస్తున్నారన్నారంటూ పరోక్షంగా సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఇలాంటి వాళ్లు తెలంగాణకు న్యాయం చేయలేరన్నారు. మూఢనమ్మకాలు ఉన్న వ్యక్తులు తెలంగాణను ముందుకు తీసుకెళ్లలేరని మోడీ విమర్శించారు. తమ పోరాటం పలితాన్ని ఇస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

గుజరాత్ లో ఒక ప్రాంతానికి వెళ్తే అధికారం పోతుందనే ప్రచారం ఉండేది., అయితే తాను పదే పదే ఆ ప్రాంతానికి వెళ్లేవాడినని మోడీ గుర్తు చేసుకున్నారు.మూడ నమ్మకాలు తెలంగాణ అభివృద్దికి అడ్డంకిగా మారాయని ప్రధాని మోదీ చెప్పారు.