Asianet News TeluguAsianet News Telugu

రాళ్లు , కర్రలు ఎవరి చేతుల్లో వున్నాయి.. నిరూపిస్తే రాజకీయ సన్యాసం : బీజేపీకి పల్లా రాజేశ్వర్ రెడ్డి సవాల్

మునుగోడులో మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై దాడి ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలకు సవాల్ విసిరారు టీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి

trs mlc palla rajeshwar reddy challenge to bjp leaders on etela attack issue
Author
First Published Nov 2, 2022, 3:48 PM IST | Last Updated Nov 2, 2022, 3:48 PM IST

మునుగోడులో బీజేపీ కుట్రలకు పాల్పడుతోందన్నారు టీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేసేలా బీజేపీ నేతలే అనుచరులను రెచ్చగొట్టారని ఆరోపించారు. మాపై దాడి చేస్తుంటే గ్రామస్తులు అడ్డుగా నిలబడ్డారని.. మేం ఆపడానికి వెళ్తే మాపైనా దాడి చేశారని పల్లా చెప్పారు. టీఆర్ఎస్ నేతల చేతుల్లో రాళ్లు, కర్రలున్నాయా అని రాజేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. ఉన్నాయని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఆయన సవాల్ విసిరారు. ఈటల రాజేందర్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతకుముందు మంత్రి జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ నేతలపై బీజేపీ కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగా దాడి చేశారని ఆరోపించారు ద్విచక్ర వాహనాలపై కూర్చొని వున్న టీఆర్ఎస్ శ్రేణులపై రాళ్లతో దాడి చేశారన్నారు. దాడి విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ శ్రేణులు భారీగా అక్కడికి చేరుకున్నారని మంత్రి చెప్పారు. ఎమ్మెల్సీ రాజేశ్వర్ రెడ్డి కూడా హుటాహుటిన సంఘటనాస్థలికి చేరుకున్నారని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చి పలివెలలో రాళ్లు, కర్రలతో దాడి చేశారని ఆయన ఆరోపించారు. గొడవను ఆపేందుకు ప్రయత్నించిన పోలీసులు, టీఆర్ఎస్ నేతలపైనా దాడి చేశారని జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజ్ అంతా వుందని.. ఎవరు, ఎవరిపై దాడి చేశారన్నది తమ దగ్గర ఆధారాలు వున్నాయని మంత్రి తెలిపారు. 

ALso REad:ఈటల రాజేందర్‌పై దాడి.. ఎవరి పనో ఆధారాలున్నాయ్ : మంత్రి జగదీశ్ రెడ్డి

కాగా.. ఇన్ని రోజుల పాటు ప్రశాంతంగా సాగిన మునుగోడు ఉపఎన్నిక ప్రచారం చివరి రోజు ఉద్రిక్తతలకు దారి తీసిన సంగతి తెలిసిందే. మునుగోడు మండలం పలివెలలో మంగళవారం మధ్యాహ్నం ప్రచారం చేస్తున్న హుజురాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ కాన్వాయ్‌పై టీఆర్ఎస్ శ్రేణులు దాడికి దిగాయి. అయితే దీనికి వెంటనే స్పందించిన బీజేపీ శ్రేణులు ప్రతిదాడికి దిగాయి. ఇరు పార్టీల శ్రేణులు కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టాయి. ఈ దాడిలో ఈటల కారు అద్దాలు ధ్వంసమవ్వగా.. ఆయన పీఆర్వో కాలికి గాయమైంది. అటు బీజేపీ కార్యకర్తల దాడిలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, నల్గొండ జిల్లా పరిషత్ ఛైర్మన్ జగదీశ్‌కు గాయాలయ్యాయి. 

ఈ వ్యవహారంపై టీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మునుగోడు మండ‌లం ప‌లివెల‌లో చోటుచేసుకున్న పరిణామాలపై టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ మంగళవారం స్పందించారు. పులివెలలో టీఆర్ఎస్ శ్రేణులపై బీజేపీ గుండాలు దాడి చేశారని విమర్శించారు. 25 రోజులుగా తమ ప్ర‌చారం తాము చేసుకున్నామని.. ఎక్కడ ఇలాంటి ఘటనలు జరగలేదని అన్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి, ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ జగదీష్‌లపైన కూడా దాడి జరిగిందన్నారు. మునుగోడు నియోజ‌క‌వ‌ర్గంలో నిర్వ‌హించిన రోడ్ షోలో పాల్గొన్న కేటీఆరర్ మాట్లాడుతూ.. ఓడిపోయేవాళ్లు ఇలాంటి చిల్ల‌ర ప‌నులే చేస్తారని విమర్శించారు. ఈ ఘటనపై పోలీసు కేసు పెట్టినమని.. చట్టప్రకారం ఎదుర్కొందామని చెప్పారు. ఎవ‌రూ తొంద‌ర‌ప‌డ‌వద్దని టీఆర్ఎస్ శ్రేణులను కోరారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios