హైదరాబాద్ పేరు మారిస్తే ఏమొస్తుందని ప్రశ్నించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. పేర్లు మార్చడం కాదు, పరిపాలనా విధానం మార్చుకోవాలని ఆమె హితవు పలికారు.

అసెంబ్లీ ఎన్నికల్లో బండ్ల గణేశ్.. ఇప్పుడు బండి సంజయ్ కామెడీ షోలు చేస్తున్నారని కవిత సెటైర్లు వేశారు. ఈ సారి గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ సెంచరీ కొట్టడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

కాగా, జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గాంధీనగర్ డివిజన్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాదయాత్ర ప్రారంభించారు‌. డివిజన్‌లోని పలు బస్తీలు, కాలనీల్లో పాదయాత్ర చేస్తూ, ప్రజలను పలకరిస్తున్నారు.

దాదాపు 500 మందికి పైగా కార్యకర్తలు, నాయకులతో కలిసి పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పుడున్న హైదరాబాద్, గత ఆరేండ్ల కిందటి హైదరాబాద్‌ను ఒకసారి ఓటర్లు భేరీజు వేసుకోవాలని కవిత విజ్ఞప్తి చేశారు. జాతీయ పార్టీలు చాలా ఏళ్లు అధికారంలో ఉన్నా హైదరాబాద్‌ను ఏనాడు పట్టించుకోలేదని ఆమె ఎద్దేవా చేశారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం నగరం రూపురేఖలు మార్చేసిందని... అద్దంలా మెరిసే రోడ్లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఐటీ, ఈ కామర్స్ మొదలైనవన్ని టీఆర్ఎస్ వల్లే సాధ్యమయ్యాయన్న విషయం ప్రజలు గుర్తించాలని కవిత వ్యాఖ్యానించారు.