TRS MLC Kavitha : కాంగ్రెస్, బీజేపీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు ఈ వారంలో తెలంగాణకు రానున్నారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. రాజకీయ పర్యాటకులు వస్తున్నరు అంటూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాలపై విమర్శలు గుప్పించారు.
Telangana: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం చాలా దూరంలోనే ఉన్నప్పటికీ.. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్ని ఇప్పటి నుంచే ఎన్నికల వ్యూహాలు రచిస్తూ.. ముందుకు సాగుతున్నాయి. దీనికి అనుగుణంగా సమావేశాలు, సభలు నిర్వహించడానికి సిద్ధమవుతున్నాయి. ఇక కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ రావడంతో పాటు సభలు, సమావేశాలు నిర్వహించడానికి ప్రణాళికలు చేయడంతో రాజకీయాలలో హీటు పెంచుతున్నాయి. రాహుల్ గాంధీ, జేపీ నడ్డాలు ఈ వారం తెలంగాణకు రానున్నారు. ఈ నేపథ్యంలోనే వారి రాకపై స్పందించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. రాజకీయ పర్యాటకులు వస్తున్నరు అంటూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాలపై విమర్శలు గుప్పించారు. వారు తెలంగాణకు రావడం కేవలం రాజకీయ పర్యాటకం మాత్రమేనని విమర్శించారు.
ఎన్నికలకు ముందు చాలా మంది రాజకీయ పర్యాటకులు రాష్ట్రాన్ని సందర్శిస్తారని అన్నారు. వారు తెలంగాణ ప్రజలకు చేసిందేమి లేదని పేర్కొన్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) ప్రజల కోసం నిజంగా పనిచేస్తుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. రాహుల్ గాంధీ సభపైనా ఆమె తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ పర్యటన సందర్భంగా రైతుల సమస్యలపై వరంగల్‌లో జరగాల్సిన బహిరంగ సభపై కేవలం రాజకీయాల కోసమేనని ఆరోపించారు. రైతులకు వారు ఏం చేశారని ప్రశ్నించారు. “తెలంగాణ వరి సేకరణ సమస్య నడుస్తున్నప్పుడు, మేము దానిని పార్లమెంటులో లేవనెత్తాలని మరియు తెలంగాణ రైతులను ఆదుకోవాలని రాహుల్ గాంధీని అభ్యర్థించాము. కానీ, పార్లమెంటులో తెలంగాణ, రైతుల గురించి మాట్లాడలేదన్నారు. ఇప్పుడు ఆయన ఇక్కడ ఏదో ‘రైతు సంఘర్షణ సభ’ ప్లాన్ చేస్తున్నారు. ఇది రాజకీయం తప్ప మరొకటి కాదు' అని కవిత ఆరోపించారు.
వరంగల్‌లో బహిరంగ సభలో ప్రసంగించడంతో పాటు, రాహుల్ గాంధీ తన రెండు రోజుల రాష్ట్ర పర్యటనలో హైదరాబాద్‌ను కూడా సందర్శించనున్నారు. అలాగే, ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. రాహుల్ ఓయూ సందర్శనకు మొదట అనుమతి నిరాకరించిన వర్సిటీ అధికారులు.. తర్వాత ఓయూలో సభకు అనుమతించారు. ఇదిలావుండగా, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్ పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా గురువారం మహబూబ్‌నగర్‌లో జరిగే బహిరంగ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ. నడ్డా ప్రసంగించనున్నారు. బీజేపీ తీరుపైనా ఎమ్మెల్సీ కవిత తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామన్న హామీని నెరవేర్చడంలో విఫలమయ్యారని బీజేపీ సిట్టింగ్ ఎంపీ అరవింద్ ధర్మపురిపై మండిపడ్డారు. ఈ ప్రాంత పసుపు రైతుల చిరకాల డిమాండ్ అయిన పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడంలో అరవింద్ విఫలమయ్యారని పేర్కొన్నారు. బీజేపీ రైతు వ్యతిరేకి అని ఆరోపించారు. ఎంపీగా గెలిచిన అరవింద్ మూడేళ్లలో ప్రజలకు ఏం చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి అరవింద్ గెలిచారని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నేరవేర్చలేదని విమర్శించారు.
