బండి సంజయ్ కుమార్ రెండు సంవత్సరాలు ఎంపీగా ఉన్నా కరీంనగర్ అభివృద్ధిని పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు టీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.

బుధవారం కరీంనగర్ పర్యటనకు వచ్చిన ఆమెకు మంత్రి గంగుల కమలాకర్ స్వాగతం పలికారు. అనంతరం నగరంలోని శివాలయం, కరీముల్లా ఆశ దర్గాలను కవిత సందర్శించారు.

ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. చాలా రోజుల తర్వాత కరీంనగర్ కు రావడం సంతోషంగా ఉందన్నారు. శివాలయంలో గౌరీ మాత కు పూజలు చేయడం అదృష్టంగా భావిస్తున్నానని కవిత చెప్పారు.

హైదరాబాద్ జిహెచ్ఎంసి ఎన్నికల్లో పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కరీంనగర్ కు వచ్చిన ట్రిపుల్ ఐటీ కాపాడుకోకపోవడం బండి సంజయ్ దురదృష్టమని కవిత ఎద్దేవా చేశారు.

జిహెచ్ఎంసి ఎన్నికల చరిత్రలోనే అత్యధిక పోలింగ్ జరిగిందని.. కానీ బీజేపీ నేతలు దీనిని తెలుసుకోకుండా టీఆర్ఎస్‌ని విమర్శించడం తగదని కవిత పేర్కొన్నారు.