Telangana: దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్తులను అమ్ముతున్నారు.. వాటి ద్వారా వచ్చే డబ్బుతో అసలు ఏం చేయబోతున్నారు అని చెప్పే చిత్తశుద్ది బీజేపీ నాయకులకు ఉన్నదా ? అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.
TRS kalvakuntla kavitha: కేంద్ర ప్రభుత్వ తీరుపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి ఫైర్ అయ్యారు. ప్రభుత్వం రంగ సంస్థలను అమ్మడంపై ఆమె కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. చత్తీస్‌గఢ్, మధ్య ప్రదేశ్, కర్నాటక, ఆదిలాబాద్ లో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీని అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం టెండర్లు పిలుస్తోంది. "తెలంగాణలో సింగరేణి బొగ్గు గనులు, సిమెంట్ ఫ్యాక్టరీలు అమ్మగా వచ్చిన డబ్బును తెలంగాణ రాష్ట్రం కోసం వినియోగిస్తారా? ఇది అడిగే దమ్ము రాష్ట్ర భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులకు ఉందా? అంటూ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్తులను అమ్ముతున్నారు.. వాటి ద్వారా వచ్చే డబ్బుతో అసలు ఏం చేయబోతున్నారు అని చెప్పే చిత్తశుద్ది బీజేపీ నాయకులకు ఉన్నదా ?" అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.
"తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా కొత్త ఫ్యాక్టరీ పెట్టబోతున్నారా ? లేదా ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినటువంటి కాలేశ్వరం లాంటి ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేయబోతున్నారా ? కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తారా ? అంటూ కవిత కేంద్ర సర్కారుకు ప్రశ్నలు సంధించారు. తెలంగాణ లో ఉన్నటువంటి సింగరేణి బొగ్గు గనులను , ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ మరియు ఇతర ప్రభుత్వరంగ సంస్థలను అమ్మడం ద్వారా మీరు ఏం సాధించాలి అనుకుంటున్నారు ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి , బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సమాధానం చెప్పాలి" ఆమె డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ స్వయంగా ప్రధానమంత్రి మోడీని కలిసి అదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ గురించి చర్చించారని తెలిపారు. మంత్రి కేటీఆర్ సైతం అనేకమార్లు ఉత్తరాలు కూడా రాయడం జరిగిందని పేర్కొన్నారు. ఎన్నో కుటుంబాలు ఆధార పడ్డ ఫ్యాక్టరీలను మూసివేసి మీరు ప్రజలకు ఏమి సమాధానం చెప్తారు అని ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తామని ముందుకు వచ్చినా కూడా సిమెంట్ ఫ్యాక్టరీ అమ్మివేయడం వెనక ఉన్న అర్థం ఏమిటని కవిత కేంద్రాన్ని నిలదీశారు. కొన్ని వేల కుటుంబాలు ఆధారపడ్డ ఫ్యాక్టరీని మూసివేసి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న బీజేపీ పార్టీని అడుగడుగునా ప్రశ్నించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ఆమె కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై కూడా విమర్శలు గుప్పించారు. ప్రాంతీయ పార్టీలకు స్పష్టమైన ఎజెండా ఉందని పేర్కొన్న కవిత.. రాహుల్ గాంధీ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని హితవు పలికారు. మహారాష్ట్రలో వాళ్లు అధికారం ఉన్నారు అది కూడా ఒక ప్రాంతీయ పార్టీ మద్దతుతోనే అనే విషయాన్ని గుర్తు చేశారు. మహారాష్ట్రలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓ తోక పార్టీగా మారింది. రాబోయే రోజుల్లో దేశంలోనూ ఆ పార్టీ తోక పార్టీగా మిగులుతుందని, ప్రాంతీయ పార్టీలే సారథ్య బాధ్యతలు వహిస్తూ దేశానికి దిశానిర్దేశం చేస్తాయంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
దేశంలో నిరుద్యోగం పెరిగిందని, మతపరమైన సహనం లోపించిందని, ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీల విజయంపై కాంగ్రెస్ అసూయ వ్యక్తం చేస్తున్నదని ఆరోపించారు. మెరుగైన పాలన అందిస్తున్న క్రమంలోనే ప్రాంతీయ పార్టీలు సక్సెస్ అయ్యాయని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు.
