ఏడుపాయల వన దుర్గాభవానీపై భక్తిని చాటుకున్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఈ మేరకు ఆలయంలో నూతనంగా నిర్మిస్తోన్న రథం కోసం ఆమె రూ.5 లక్షల విరాళం ప్రకటించారు. ఈ మేరకు కవిత ట్విట్టర్ ద్వారా వివరాలు తెలిపారు.  

మెదక్ జిల్లాలోని ఏడుపాయల వన దుర్గాభవానీ (edupayala vana durga temple) పుణ్యక్షేత్రం ఎంతో ప్రసిద్ధి గాంచిన సంగతి తెలిసిందే. అమ్మవారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్‌గడ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు. ఈ నేపథ్యంలో తాజాగా, అమ్మవారి ఆలయంలో నూతన రథం ఏర్పాటు చేస్తున్నారు. అందుకోసం టీఆర్ఎస్ (trs) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విరాళం ప్రకటించారు. 

వన దుర్గా మాత అమ్మవారి ఆలయంలో కొత్త రథం నిర్మాణం కోసం రూ.5 లక్షల విరాళం ఇచ్చినట్టు ఆమె వెల్లడించారు. తన ఎమ్మెల్సీ వేతనం నుంచి ఉడుతాభక్తిగా ఈ విరాళం ఇచ్చానని కవిత పేర్కొన్నారు. విరాళాన్ని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ద్వారా ఆలయ కమిటీకి అందజేసినట్టు ఆమె ట్వీట్ చేశారు. ఏడుపాయల దుర్గమ్మ క్షేత్రాన్ని 12వ శతాబ్దంలో నిర్మించిన ఆలయంగా భావిస్తారు. ఇది మంజీరా నదీ తీరాన కొలువై ఉంది. 

ఇకపోతే.. రాజకీయాలతో పాటు సోషల్ మీడియాలోనూ చురుగ్గా వుంటారు కవిత (kalvakuntla kavitha) . పార్టీ కార్యక్రమాలు, వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అప్‌డేట్ చేస్తూ వుంటారు. అలాగే సమకాలీన అంశాలపైనా కవిత స్పందిస్తూ వుంటారు. ఈ సందర్భంగా క‌విత త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ఓ ఆస‌క్తిక‌ర వీడియో పోస్ట్ చేశారు. 

హైదరాబాద్ శివారులోని నాన‌క్ రామ్ గూడ‌లో ఓ త‌ల్లి త‌న కుమార్తెను స్కూట‌ర్‌పై బ‌డికి తీసుకెళుతోంది. ఆ మ‌హిళ‌తో పాటు ఆమె కూతురు కూడా హెల్మెట్ పెట్టుకుని వుంది. కారులో వెళ్తుండగా ఈ విష‌యాన్ని గమనించిన క‌ల్వ‌కుంట్ల క‌విత ఈ వీడియో తీశారు. 'స్ఫూర్తిమంత‌మైన త‌ల్లీకూతుళ్లు.. నాన‌క్ రామ్ గూడ చౌర‌స్తా వ‌ద్ద ఈ రోజు నేను ఈ విష‌యాన్ని గుర్తించాను. హెల్మెట్ పెట్టుకోండి, సుర‌క్షితంగా ఉండండి' అని క‌విత ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Scroll to load tweet…