Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ బీజేపీ నేతలు చేతకాని చవటలు, దద్దమ్మలు: కడియం శ్రీహరి

తెలంగాణ పురోగ‌తి దిశ‌గా వెళ్తుంటే.. తిరోగమన దిశగా భారత దేశం వెళ్లోందని టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఆవేదన వ్యక్తం చేశారు.బీజేపీ ముక్తా భారత్ కావాలనీ, కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని ఆశించారు.  

trs mlc kadiyam srihari sensational comments on pm modi and telangana bjp leaders
Author
First Published Sep 13, 2022, 12:18 PM IST

తెలంగాణ బీజేపీ నాయ‌కులు, కేంద్ర మంత్రులపై టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. విభజన చట్టం రూపొందించేటప్పుడే తెలంగాణ కు అన్యాయం జరిగిందనీ, అన్ని రకాల కేంద్ర విద్యాసంస్థలు ఏపీలో నెలకొల్పేలా చట్టంలో పొందుపరిచారని కడియం శ్రీహరి ఆరోపించారు. తెలంగాణకు ఇచ్చిన ట్రైబల్ యూనివర్సిటీ ఇంకా ప్రారంభానికి నోచుకోలేదనీ, కేంద్రం తెలంగాణకు ఇచ్చిన ఏ ఒక్క విభజన హామీ నెరవేర్చలేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఏపీకి రావాల్సిన అన్నింటినీ దగ్గరుండి ఏపీకి ఇప్పించారనీ, తెలంగాణ కూడా ఓ కేంద్ర మంత్రి ఉన్నాడు కానీ, ఢిల్లీ నుంచి రావడం ఒక ప్రెస్ మీట్ పెట్టడం కేసీఆర్ ప్రభుత్వాన్ని తిట్టడం ఆయ‌న పని అని ప‌రోక్షంగా కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డిపై ఫైర్ అయ్యారు.

కిషన్ రెడ్డి ఢిల్లీలో ఏం చేస్తున్నారు? గడ్డి పికుతున్నారా? తెలంగాణ ప్రభుత్వం పై విమర్శలు చేసే నైతిక హక్కు ఆయ‌న‌కు ఉందా? అని ప్ర‌శ్నించారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు కేసీఆర్ ను చూసి భయపడుతున్నారనీ, బండి సంజయ్, కిషన్ రెడ్డికి తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే విభజన హామీలు అమలు చేసేలా కేంద్రం పై ఒత్తిడి తేవాలని స‌వాల్ విసిరారు. 

బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు చేతకాని చవటలు, దద్దమ్మలనీ,  తెలంగాణ‌పై కేంద్రం చూపిస్తున్న వివక్షను ఖండించ‌లేక‌పోతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో మతాల మధ్య గొడవలు పెట్టి, విద్వేషాల‌ను సృష్టించాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నార‌ని, ఈ ఇలాంటి అనైతిక చర్య‌ల‌ను తెలంగాణ ప్రజలు చూస్తూ సహించారని స్ప‌ష్టం చేశారు. బీజేపీ ముక్తా భారత్ కావాలనీ, కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని ఆశించారు.  

కేంద్రప్ర‌భుత్వం  అన్ని పరిశ్రమలను ప్రైవేటుకు అమ్ముకోవాలని చూస్తోంద‌నీ, 16 కోట్ల ఉద్యోగాలు కేంద్రంలో రావాల్సి ఉంద‌నీ, 16 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వ‌లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పేద, మైనార్టీ, బడుగు బలహీన వర్గాలపై మోడీకి, బీజేపీకి కోపం ఉందని.. అందుకే రిజర్వేషన్లను ఎత్తివేసే కుట్ర జ‌రుగుతుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తెలంగాణ అన్ని రంగాల్లో ప్ర‌గ‌తి ప‌థంలో ముందుకు వెళ్తుంద‌నీ, కానీ దానిని  అడుకునే ప్రయత్నం కేంద్ర ప్ర‌భుత్వం చేస్తోందని ఆరోపించారు.

Follow Us:
Download App:
  • android
  • ios