మహబూబ్ నగర్: పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల సందర్భంగా  నియోజకవర్గ అలంపూర్ లో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటుచేసింది. ఈ సమావేశంలో శాసనమండలి టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవితో పాటు రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ రాములు, ఎమ్మెల్యే అబ్రహం, జడ్పీ చైర్ పర్సన్ సరిత తదితరులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా వాణీదేవి మాట్లాడుతూ... పాలమూరు కోడలయిన తనను ఆశీర్వదించాలని కోరారు. విద్యావేత్తగా తనకు ఎన్నో ఏళ్లుగా అనుభవం ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు ఎన్నికలలో పోటీకి నిలిచాను... అందరూ ఆశీర్వదించి ఓట్లేసి తనను శాసనమండలికి పంపించాలని కోరారు. మీ సమస్యలపై నాకు సంపూర్ణ అవగాహన ఉంది... వాటి పరిష్కారానికి కృషిచేస్తానని వాణిదేవి హామీ ఇచ్చారు.

''టీఆర్ఎస్ పాలనలో బంజరు భూముల పాలమూరులో బంగారు పంటలు పండుతున్నాయి. 24 గంటల కరెంటుతో రైతులకు ప్రభుత్వం అండగా నిలిచింది. పనిచేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలవండి ... మీ సమస్యలు పరిష్కరించే అవకాశం నాకివ్వండి'' అని వాణిదేవీ పట్టభద్రులను కోరారు. 

read more   ఆరు సర్వేల్లో టీఆర్ఎస్‌కి అనుకూలం: ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ దళానికి బూస్ట్

అనంతరం మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ...ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో ఇబ్బందులను ఓర్చి తెలంగాణ సాధించిపెట్టాడన్నారు. తెచ్చుకున్న తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ గా చేసాడన్నారు. ప్రతిపక్షాలు చెప్పే మాయమాటల పట్ల పట్టభద్రులు ఆలోచన చేయాలని మంత్రి సూచించారు.

''తెలంగాణ లో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు మీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా అని ప్రశ్నించాలి. వాణిదేవికి అలంపూరు ప్రజలు అండగా నిలవాలి. ప్రతి ఒక్కరూ 50 మంది ఓటర్ల బాధ్యత తీసుకోవాలి. ఇక్కడ ఉన్న 6280 మంది ఓటర్లను కలిసి మనకు అనుకూలంగా ఓటేయాలి'' అని కోరారు. 

''బీజేపీ అభ్యర్థి ఇంతకుముందు గెలిసి చేసింది ఏం లేదు. ఇక ముందు చేసే అవకాశం కూడా లేదు. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ అభ్యర్థిని గెలుపిస్తేనే సమస్యల పరిష్కారం సాధ్యం. టీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే కలిగే ప్రయోజనాలను ఓటర్లకు వివరించాలి. తెలంగాణ లో ఉన్నట్లు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఇక్కడి తరహా పథకాలు లేవు. పట్టభద్రులు ఆలోచన చేయాలి.. వాణిదేవికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి'' అని మంత్రి ప్రశాంత్ రెడ్డి ఓటర్లను కోరారు.