Asianet News TeluguAsianet News Telugu

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసు.. నేడు మరోసారి సిట్ విచారణకు హాజరైన లాయర్ ప్రతాప్

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో సిట్ దర్యాప్తు కొనసాగిస్తుంది. సిట్ నోటీసులు అందుకున్న లాయర్ ప్రతాప్ గౌడ్ నేడు మరోసారి సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు.

trs mlas poaching case Lawyer Pratap Goud once again attend for sit inquiry
Author
First Published Nov 26, 2022, 11:05 AM IST

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో సిట్ దర్యాప్తు కొనసాగిస్తుంది. సిట్ నోటీసులు అందుకున్న లాయర్ ప్రతాప్ గౌడ్ నేడు మరోసారి సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్‌తో ప్రతాప్ గౌడ్ జరిపిన లావాదేవీలపై అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ కేసుకు సంబంధించి లాయర్ ప్రతాప్ గౌడ్, నందకుమార్ భార్య చిత్రలేఖను సిట్ అధికారులు శుక్రవారం దాదాపు 8 గంటల పాటు విచారించారు. విచారణలో భాగంగా సిట్ అధికారులు అడిగిన పలు ప్రశ్నలపై ప్రతాప్ గౌడ్ తనకు తెలియదని చెప్పగా.. అధికారులు వాటికి సంబంధించిన పలు ఆధారాలను ఆయన ముందు ఉంచినట్టుగా తెలుస్తోంది. 

ఇక, విచారణ సందర్భంగా నందకుమార్, ప్రతాప్ గౌడ్‌ల మధ్య జరిగిన లావాదేవీలను సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రతాప్ గౌడ్ కాల్ రికార్డును కూడా సిట్ అధికారులు స్వాధీనం చేసుకనున్నట్టుగా తెలుస్తోంది. ప్రతాప్ గౌడ్ కూడా అధికారుల ప్రశ్నలను దాటవేసే ప్రయత్నం చేశారని సమాచారం. దీంతో ఆయనను శనివారం మరోసారి విచారణకు హాజరుకావాల్సిందిగా సిట్ అధికారులు ఆదేశించారు. మరోవైపు సోమవారం మరోసారి విచారణకు హాజరుకావాలని నందకుమార్ భార్య చిత్రలేఖకు సిట్ అధికారులు తెలిపారు. 

ఇదిలా ఉంటే.. శుక్రవారం కరీంనగర్‌కు చెందిన న్యాయవాది శ్రీనివాస్ కూడా సిట్ ఎదుట హాజరు కావాల్సి ఉంది. అయితే తనకు గాయం కావడంతో చికిత్స పొందాల్సి  ఉన్న నేపథ్యంలో విచారణకు రాలేకపోతున్నానని సిట్ అధికారులకు శ్రీనివాస్ సమాచారం ఇచ్చారు. ఈ కేసులో శ్రీనివాస్‌ను పోలీసులు ఇదివరకే విచారించిన సంగతి తెలిసిందే. 

ఇక, సిట్ నోటీసులపై స్టే ఇవ్వాలంటూ ప్రతాప్ గౌడ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.  నిందితుడు కాకపోయినా 41ఏ సీఆర్పీసీ  కింద సిట్ నోటీసులు ఇవ్వడాన్ని ప్రతాప్ గౌడ్ తప్పుబట్టారు. అయితే కారణాలు ఉండడం వల్లే నోటీసులు ఇచ్చామని సిట్ హైకోర్టుకు తెలిపింది. ఈ క్రమంలోనే సిట్ ముందు హాజురుకావాలని ప్రతాప్‌ గౌడ్‌ను హైకోర్టు ఆదేశించింది.  అలాగే తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ప్రతాప్ గౌడ్ ను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు సిట్ ను ఆదేశించింది.

Follow Us:
Download App:
  • android
  • ios