హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ తన మంత్రివర్గాన్ని మంగళవారం నాడు విస్తరించనున్నారు.మంత్రివర్గంలో చోటు దక్కుతోందనే ప్రచారం ఉన్న ఎమ్మెల్యేలు సోమవారం నాడు సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. రాజ్‌భవన్‌లో 16 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేసేలా  ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

మంగళవారం నాడు ఉదయం పదకొండున్నర గంటలకు రాజ్ ‌భవన్‌లో కేసీఆర్ మంత్రివర్గ విస్తరణకు ముహుర్తాన్ని ఎంచుకొన్నారు. ఈ తరుణంలో మంత్రివర్గంలో చోటు దక్కుతోందని ప్రచారం ఉన్న నేతలు ప్రగతిభవన్‌లో సోమవారం నాడు కేసీఆర్‌తో భేటీ అయ్యారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన కొప్పుల ఈశ్వర్, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌లు సోమవారం నాడు  కేసీఆర్‌తో భేటీ అయ్యారు.

ఈ ముగ్గురికి కేబినెట్‌లో బెర్త్ ఖాయమైనట్టుగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ప్రమాణ స్వీకారానికి సిద్దంగా ఉండాలని  కేసీఆర్ చెప్పారని సమాచారం. ఉమ్మడి పది జిల్లాలకు ప్రాతినిథ్యం దక్కేలా కేసీఆర్ మంత్రివర్గం కూర్పు ఉంటుందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. మరో వైపు  మంత్రివర్గంలో అన్ని సామాజికవర్గాలకు కూడ ప్రాతినిథ్యం దక్కేలా కేసీఆర్ జాగ్రత్తలు తీసుకొంటున్నారు.