Asianet News TeluguAsianet News Telugu

అసెంబ్లీలో రోడ్లపై చర్చ: అధికారపక్షంలో విపక్షం, ప్రభుత్వాన్ని కడిగేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

తెలంగాణ రాష్ట్రంలోని రహదారులు దుర్బర పరిస్థితిపై బుధవారం జీరో అవర్ లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఆరుగురు ఎమ్మెల్యేలు ముప్పేట దాడికి దిగారు. 
 

TRS MLAs grill own government over deplorable condition of roads
Author
Hyderabad, First Published Sep 19, 2019, 12:52 PM IST


హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. స్వపక్ష ఎమ్మెల్యేలు విపక్ష సభ్యులుగా మారిపోయారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటికీ ప్రజా సమస్యలపై తమ ప్రభుత్వాన్ని కడిగి పారేశారు. కొందరు ఎమ్మెల్యేలు అయితే మంత్రులతో సైతం వాదోపవాదనలకు దిగారు.

తెలంగాణ రాష్ట్రంలోని రహదారులు దుర్బర పరిస్థితిపై బుధవారం జీరో అవర్ లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఆరుగురు ఎమ్మెల్యేలు ముప్పేట దాడికి దిగారు. 

రహదారుల దారుణ పరిస్థితుల్లో ఉన్నాయంటూ మంత్రులను తమదైన శైలిలో కడిగిపారేశారు. తొలుత రోడ్ల దుస్థితిపై ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు కాగజ్ నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. మురళిగూడెం- బెజ్జురు రహదారి మరింత దయనీయంగా ఉందని తెలిపారు. అంబులెన్స్ వెళ్లేందుకు కూడా రహదారి వీలు లేకుండా పోయిందన్నారు. 

రెండురోజుల క్రితం ఒక గర్భిణీ స్త్రీ డెలీవరీ అయినట్లు చెప్పారు. డెలీవరీ కోసం ట్రాక్టర్ లో వెళ్తున్న గర్భిణీ స్త్రీ కుదుపులతో దారి మధ్యలో కాన్పు జరిగిన దుస్థితి నెలకొందన్నారు. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు ఆ పసికందు మరణించడం తనను  కలచివేసిందని కోనేరు కోనప్ప ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. అధికారుల నిర్లక్ష్యమే ఆ పసికందు మరణానికి కారణమని ఆరోపించారు.   

తన నియోజకవర్గం పరిధిలోని అన్ని మండలాల రోడ్ల పరిస్థితి ఇలాగే తయారైందని ఆరోపించారు. గత నెలలుగా రోడ్ల దుస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తున్నామని అయితే పట్టించుకోలేదన్నారు. తాజాగా వచ్చిన వర్షాలకు మరింత దారుణంగా రోడ్లు తయారయ్యాయంటూ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.

మరోవైపు దేవరకద్ర టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి సైతం జీరో అవర్ లో రోడ్ల దుస్థితిపై అధికారుల తీరును కడిగిపారేశారు. కొత్తకోట, జనగాం, మైపల్లి గ్రామాలను కలిపే వంతెనను రెండు సంవత్సరాల క్రితం ప్రభుత్వం ధ్వంసం చేసిందని చెప్పుకొచ్చారు. 

రెండు కోట్ల రూపాయలతో నూతన వంతెన నిర్మాణం చేపడతామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని అయితే రీ డిజైన్ పేరుతో ఆ పనుల కాస్ట్ రూ.2కోట్లు నుంచి రూ.2.5కోట్లకు పెరిగిందని కానీ వంతెన మాత్రం ఇప్పటకీ ప్రారంభించలేదన్నారు. 

ఇకపోతే కుత్భుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కేపీ వివేకానంద సైతం రోడ్ల దుస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాంపేట-మియాపూర్-బాచుపల్లి రోడ్డు పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని అసెంబ్లీలో చెప్పుకొచ్చారు. గుంతలతో ప్రయాణికులు నరకం అనుభవిస్తున్నట్లు స్పష్టం చేశారు. అనేక మంది తీవ్ర గాయాలపాలైనట్లు చెప్పుకొచ్చారు. 

రహదారులలో కొంతమేర జీహెచ్ఎంసీ పరిధిలోనూ మరికొన్ని ఆర్ అండ్ బీ పరిధిలో ఉన్నాయని చెప్పుకొచ్చారు. అటు జీహెచ్ఎంసీ, ఇటు ఆర్ అండ్ బీ రెండు కనీసం పాచ్ వర్క్ లు కూడా చేపట్టకపోవడం విచారకరమన్నారు. 

రోడ్ల దుస్థితికి సంబంధించి అసెంబ్లీలో ఆర్ అండ్ బీ శాఖ మంత్రి వేమూరి ప్రశాంత్ రెడ్డిని నిలదీశారు. రోడ్లను బాగు చేసేందుకు మంత్రి స్వయంగా రంగంలోకి దిగాలని సూచించారు. లేని పక్షంలో ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారని తనుపైనా, ప్రభుత్వంపైనా భవిష్యత్ లో తిరగబడే అవకాశం లేకపోలేదన్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ముఖాలు చూపించలేని పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులు ఉన్నారని తెలిపారు. 

మరోవైపు చొప్పదండి ఎమ్మెల్యే రవి శంకర్ సైతం తన నియోజకవర్గంలోని రోడ్ల దుస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. కరీంనగర్ జిల్లాలో బోయిన్ పల్లి నుంచి కోడూరుపాక వెళ్లే మార్గమధ్యలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆరోపించారు. 

అటు తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సైతం రోడ్ల పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్-కర్ణాటక రహదారి వెంబడి రోజుకు 5వేల ట్రక్కుల మైనింగ్ వాహనాలు తిరుగుతూ ఉంటాయని చెప్పుకొచ్చారు.

భారీ వాహనాల రాకపోకల వల్ల రోడ్డ మరింత డ్యామేజ్ అయ్యాయని స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అధికారులను పదేపదే కోరుతున్నానని కానీ ఎవరూ పట్టించుకోలేదని తెలిపారు. 

వికారాబాద్ ఎమ్మెల్యే ఎం ఆనంద్ సైతం రోడ్ల దుస్థితిపై సభలో ఏకరువు పెట్టారు. వికారాబాద్ లో రైల్ఓవర్ బ్రిడ్జ్ కూలిపోయే దుస్తితికి చేరుకుందని అది ఏక్షణమైనా కూలిపోవచ్చని దానిపై చర్యలు తీసుకోవాలని కోరారు. 

Follow Us:
Download App:
  • android
  • ios