సిద్ధిపేట: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగా రెడ్డి బుధవారం అర్థరాత్రి కన్నుమూశారు. ఆయన వయస్సు 57 ఏళ్లు. .అనారోగ్యం కారణంగా ఆయన గత 15 రోజుల క్రితం ఆస్పత్రిలో చేరారు. ఆయన కాలికి శస్త్రచికిత్స జరిగింది. 

ఆది ఇన్ ఫెక్షన్ కావాడంతో హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. అయితే, పరిస్థితి విషమించడంతో ఆయనను హైదరాబాదులోని గచ్చిబౌలిలో గల మరో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మరణించారు. 

దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన రామలింగారెడ్డి 2004, 2008ల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దొమ్మాట నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014, 2018 ఎన్నికల్లోనూ ఆయన విజయం సాధించారు. 

ప్రస్తుతం శానసశభ అంచనాల కమిటీ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక భూమిక పోషించారు ఆయనకు భార్య కుమారుడు, కూతురు ఉన్నారు. తొలుత ఆయన జర్నలిస్టుగా పనిచేశారు. ఉదయం దినపత్రికలో స్థానిక విలేకరిగా పనిచేశారు. రామలింగా రెడ్డి మృతికి ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు.