అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఎమ్మెల్యేల మధ్య గత కొంతకాలంగా విభేదాలు నెలకొన్న సంగతి  తెలిసిందే. అయితే తాజాగా మంత్రుల సమక్షంలోనే వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

మహబూబాబాద్ టీఆర్‌ఎస్‌లో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. గతకొంత కాలంగా అధికార పార్టీకి చెందిన ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఎమ్మెల్యేల మధ్య విభేదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మంత్రుల సమక్షంలోనే వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వివరాలు.. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన మెడికల్ కళాశాల, సమీకృత కలెక్టర్ కార్యాలయం, టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయ భవనాలను సీఎం కేసీఆర్‌ త్వరలో ప్రారంభించనున్నారు

ఈ నేపథ్యంలోనే ఆదివారం మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎంపీ మాలోత్ కవిత.. టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం పనుల పురోగతిని పరిశీలించారు. అయితే ఆ సమయంలో ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్‌ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పార్టీ కార్యాలయ పనుల గురించి మంత్రులకు వివరించే క్రమంలో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్టుగా సమాచారం. పార్టీ కార్యాలయ పనులను సంబంధిత కాంట్రాక్టర్ తో సంబంధం లేకుండా తానే సొంతంగా చేపట్టానని ఎమ్మెల్యే శంకర్ నాయక్ చెప్పడంతో.. పార్టీ కార్యాలయ నిర్మాణ ఖర్చులను పార్టీ భరిస్తుందని ఎంపీ కవిత అన్నట్టుగా తెలుస్తోంది. 

ఈ క్రమంలోనే ఇరువురి మధ్య మాట మాట పెరిగి వాగ్వాదం చోటుచచేసుకుంది. అయితే మంత్రి ఎర్రబెల్లి జోక్యం చేసుకోవడంతో .. కొంతసేపటికి వివాదం సద్దుమణిగింది. దీంతో మహబూబాబాద్ టీఆర్‌ఎస్‌లో వర్గ విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. 

ఇక, ఈ ఏడాది ఏప్రిల్‌లో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. మహబూబాబాద్‌లో టీఆర్‌ఎస్ పార్టీ తలపెట్టిన రైతు దీక్షలో మంత్రి సత్యవతి రాథోడ్ సమక్షంలోఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్ మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఎంపీ మాలోత్ కవిత రైతు దీక్షలో మాట్లాడుతుండగా స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ మైక్ లాక్కొని మాట్లాడారు. దీంతో కవిత బిత్తరపోయారు.