హుజూర్ నగర్: హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో కనీవినీ ఎరుగని రీతిలో రికార్డు స్థాయి మెజారిటీతో గెలుపొందిన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తొందరపడ్డారు. హుజూర్ నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఘనవిజయం సాధించడంతో ప్రజలకు ధన్యవాదాలు తెలిపేందుకు కృతజ్ఞత సభ ఏర్పాటు చేశారు. 

ఈ కృతజ్ఞత సభకు తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. కేసీఆర్ సమక్షంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే సైదిరెడ్డి ప్రసంగం చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి తన శాయశక్తులా కృషిచేస్తానని హమీ ఇచ్చారు. 

నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని అందుకు సీఎం కేసీఆర్ సాక్షిగా, సభ సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని ముందే ప్రమాణం చేసేశారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత అసెంబ్లీలో చేయాల్సిన ప్రమాణ స్వీకారం సభలో చేయడంతో సీఎం కేసీఆర్, మంత్రి జగదీష్ రెడ్డి సరదాగా నవ్వారు. 

ఇకపోతే సైదిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తనను, తన పార్టీని నమ్మి ఓటేసి గెలిపించిన ప్రజలకు పాదాభివందనం చేశారు సైదిరెడ్డి. హుజూర్ నగర్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటికీ తనను నమ్మి రెండోసారి అభ్యర్థిగా ప్రకటించినందుకు సీఎం కేసీఆర్ కు రుణపడి ఉంటానన్నారు.  

నిన్నటి వరకు శానంపూడి సైదిరెడ్డిని. మీ అందరినోట అరే ఒరే అని పిలిపించుకున్న వాడిని. నేటి నుంచి సైదిరెడ్డి ఎమ్మెల్యేని. ఇకపై మీ సేకుడిని. ఇప్పటికీ ఎప్పటికీ మీ ఇంటి బిడ్డగానే ఉంటానని హామీ ఇచ్చారు. 

అనంతరం సైదిరెడ్డిపై సీఎం కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. సైదిరెడ్డి యువకుడు, ఉత్సాహవంతుడు, నియోజకవర్గ అభివృద్ధికోసం పాటుపడే నాయకుడు అని కొనియాడారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే మంచి నాయకుడిని ఎన్నుకున్నందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. 

సైదిరెడ్డికి 45వేల మెజారిటీ ఇచ్చి తమ ప్రభుత్వాన్ని మరింత బలపరిచారని స్పష్టం చేశారు. కేసీఆర్ నువ్వు చేస్తుంది మంచి పని గో యే హెడ్ అన్నట్లు మీరు ఆశీర్వదించారంటూ కేసీఆర్ చెప్పుకొచ్చారు. 

సైదిరెడ్డి తెలంగాణ వ్యక్తికాదని ప్రచారం చేశారు. గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి అని కొందరు దుర్మార్గలు తప్పుడు ప్రచారం చేశారు అవునా అంటూ ప్రజలని అడిగారు. ప్రజలు కాదు కాదు అని సమాధానం ఇచ్చారు. అందుకు కర్రుకాల్చి వాతపెట్టారంటూ చెప్పుకొచ్చారు. 

ఇకపోతే హుజూర్ నగర్ ప్రజలు సైదిరెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించినందుకు దాదాపుగా రూ.100 కోట్లు కేటాయించినట్లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సైదిరెడ్డి మరో వినతిని అందించారు. 

ఇప్పటికే వంద కోట్ల రూపాయలు నిధులు ఇచ్చాను ఇంకా కావాలంటున్నాడు సరే ఏం కావాలి అంటూ చదివారు. హుజూర్ నగర్ రింగ్ రోడ్డుకు సంబంధించి అన్ని పనులు సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని, అలాగే హుజూర్ నగర్ ను రెవెన్యూ డివిజన్ చేస్తానంటూ కేసీఆర్ హామీ ఇచ్చారు. 

ఈ వార్తలు కూడా చదవండి

ఏడడుగుల మంత్రి ఏం చేయలేదు, మా మూడడుగుల బుల్లెట్ నీళ్లు తెచ్చాడు: జగదీష్ రెడ్డిపై కేసీఆర్...

హుజూర్ నగర్ కృతజ్ఞతసభ: సీఎం కేసీఆర్ వరాలజల్లు.