జనగామ: టీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వినూత్నమైన నిరసనకు దిగారు. యశ్వంత్ పూర్ గ్రామం వద్ద శనివారం నేలపై పడుకుని నిరసన వ్యక్తం చేశారు. జనగామ మున్సిపాలిటీ నుంచి యశ్వంత్ పూర్ వాగులోకి మళ్లించే మురిక కాలువ విషయంలో ఆ గ్రామ మాజీ సర్పంచ్ సుశీల తన తీరును మార్చుకోవాలని కోరుతూ ఆయన ఆ నిరసనకు దిగారు. 

యశ్వంత్ పూర్ వాగులోకి జనగామ మున్సిపాలిటీ మురికి కాలువ వద్దని చెప్పి గతంలో తెచ్చుకున్న కోర్టు స్టేను వెనక్కి తీసుకోవాలని ఆయన కోరారు. మాజీ సర్పంచ్ తనకు స్పష్టమైన హామీ ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. స్టేను వెనక్కి తీసుకుంటేనే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తానని ఆయన మొండికేశారు. దాంతో స్టేను వెనక్కి తీసుకుని ఎమ్మెల్యేకు సహకరిస్తానని సుశీల చెప్పారు. దాంతో ఆయన నేల మీంచి లేచి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 

యశ్వంత్ పూర్ గ్రామ ప్రజల అభ్యంతరాలకు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వివరణ ఇచ్చారు. ఫిల్టర్ చేసిన నీళ్లను మాత్రమే వాగులోకి తరలిస్తామని చెప్పారు. అయినా కూడా అడ్డుకోవడం సరి కాదని ఆయన అన్నారు. 

అసలు విషయానికి వస్తే... జనగామ మున్సిపాలిటీకి చెందిన మురికి నీటి కాలువన బతుకమ్మ కుంట నుంచి నెల్లుట్ల చెరువులోకి చేరుకునేది. ప్రస్తుతం కాలువను యశ్వంత్ పూర్ వాగులోకి మళ్లించడానికి యాదగిరి రెడ్డి ప్రణాళిక వేశారు. అయితే, బతుకమ్మ కుంట నుంచి నీటి కాలువ వెళ్లకుండా చేసి ముత్తిరెడ్డి ప్రయోజనం పొందాలని చూస్తున్నారని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. తన అనుచరులతో బతుకమ్మకుంట వద్ద తన యాదగిరి రెడ్డి వెంచర్ చేయించే ఆలోచనలో ఉన్నట్లు వారు ఆరోపిస్తున్నారు.