కొమురంభీం: టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అలకపాన్పు ఎక్కారు. గతంలో ఓ సమస్య విషయంలో ప్రభుత్వం సహకరించలేదని ఆరోపిస్తూ జిల్లా పరిషత్ సర్వసభ్యసమావేశానికి డుమ్మా కొట్టారు. ఎమ్మెల్యేతోపాటు పలువురు జెడ్పీటీసీలు, ఎంపీపీలు సైతం సర్వసభ్య సమావేశానికి గైర్హాజరయ్యారు. 

కొమురంభీం జిల్లా సార్సాల ఘటనలో తన సోదరుడుపై ఎఫ్ఆర్వో అనిత పెట్టిన కేసు విషయంలో ప్రభుత్వం తమకు సహకరించలేదని ఆయన వాపోయారు. సార్షాల ఘటనలో ప్రభుత్వం తన సోదరుడు కోనేరు కృష్ణపై కక్ష పూరితంగా వ్యవహరించిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇకపోతే తనపై దాడి చేశారంటూ కోనేరు కృష్ణపై ఎఫ్ఆర్వో అనిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు విచారణ చేపట్టిన పోలీసులు కోనేరు కృష్ణను అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితమే కోనేరు కృష్ణ రిమాండ్ ముగియడంతో విడుదలయ్యాడు. 

ఈ పరిణామాల నేపథ్యంలో కొమురం భీం జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశానికి ఎమ్మెల్యే కోనేరు కోనప్ప డుమ్మా కొట్టారు. కోనప్పతోపాటు ఏడుగురు జెడ్పీటీసీలు, ఏడుగురు ఎంపీపీలు సైతం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి హాజరుకాలేదు. 

మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమావేశానికి హాజరై అధికారులతో జిల్లా అభివృద్ధిపై అడిగి తెలుసుకున్నారు. ఇకపోతే కోనేరు కోనప్ప, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇద్దరు రాజకీయాల్లో గురు శిష్యులుగా ఉండేవారు. ఇద్దరూ బీఎస్పీ నుంచి గెలుపొంది ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు.