నిన్న కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా బహిరంగసభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నీ అబద్ధాలే మాట్లాడారని అన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. నిరుద్యోగులకు, మహిళలకు టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద పీట వేసిందని జీవన్ రెడ్డి చెప్పారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన .. రేవంత్ తెలంగాణ ద్రోహి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిన్న కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా బహిరంగసభలో రేవంత్ రెడ్డి అన్నీ అబద్ధాలే మాట్లాడారని అన్నారు. నిరుద్యోగులకు, మహిళలకు టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద పీట వేసిందని జీవన్ రెడ్డి చెప్పారు.
మహిళల రుణాలకు రూ. 200 కోట్ల వడ్డీ చెల్లించామని ఆయన వెల్లడించారు. ఇప్పటి వరకు లక్షా 26 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని జీవన్ రెడ్డి గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చామని చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర ప్రజలు భూమిలో పాతి పెట్టారని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణలో సోనియా రాజ్యం వచ్చే పరిస్థితే లేదని జీవన్ రెడ్డి జోస్యం చెప్పారు. 2009లో పొత్తు వల్లే రేవంత్ గెలిచారని... కేసీఆర్ వల్లే రేవంత్ కు టీపీసీసీ ఉద్యోగం వచ్చిందంటూ ఆయన దుయ్యబట్టారు. కేసీఆర్ ఆదేశిస్తే రేవంత్ ను 300 కిలోమీటర్ల లోతుకు తొక్కుతామంటూ జీవన్ రెడ్డి హెచ్చరించారు.
