Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు కాళ్లు పట్టుకుంటే.. సిరిసిల్లలో నువ్వు ఎమ్మెల్యేగా గెలిచావ్: కేటీఆర్‌పై రేవంత్ రెడ్డి విమర్శలు

కెకె మహేందర్ రెడ్డికి ద్రోహం చేసి సిరిసిల్లలో టిక్కెట్ కేటీఆర్‌కు టికెట్ ఇచ్చారంటూ టీపీసీసీ  చీఫ్ రేవంత్ ఆరోపించారు. చంద్రబాబు నాయుడు కాళ్లు పట్టుకుంటే టీడీపీ కేటీఆర్‌ను అక్కడ గెలిపించిందని ఆయన ధ్వజమెత్తారు. తండ్రికి తెలియకుండానే కేటీఆర్ రాజకీయాల్లోకి వచ్చారన్న మాట అవాస్తవమన్నారు. 
 

tpcc chief revanth reddy slams minister ktr
Author
Hyderabad, First Published Aug 18, 2021, 8:01 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా సభకు వచ్చిన వారిని డ్రోన్ కెమెరాల ద్వారా చిత్రీకరించి తెలంగాణ సీఎం కేసీఆర్‌కు పంపాలన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రావిరాలలో జరుగుతున్న దళిత గిరిజన దండోరా సభలో ఆయన మాట్లాడుతూ.. హుజురాబాద్‌లో జరిగిన సీఎం సభలో జనం లేరంటూ రేవంత్ ఎద్దేవా చేశారు. ఇంకా 19 నెలల పాటు కేసీఆర్ పాలనలో వుండాలా అని జనం ఆందోళణ వ్యక్తం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ ఉద్యమంలో చనిపోయింది ఎవరో.. రాష్ట్ర ఏర్పాటు తర్వాత సంపదను దోచుకున్నదెవరో ప్రజలు ఆలోచించాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

తాను పీసీసీ అధ్యక్షుడిని అయిన తర్వాత కేసీఆర్ కాళ్లు కాలిన పిల్లిలాగా తిరుగుతున్నారంటూ ఆయన ధ్వజమెత్తారు. రూ.10 లక్షలు దళితులకు బిచ్చంకాదన్నారు. ప్రజలు పన్ను కట్టడం  ద్వారా, భూములను వేలం వేయడం వల్ల వచ్చిన డబ్బుతో రూ.10 లక్షలు ఇస్తానని కేసీఆర్ అంటున్నారని రేవంత్ ఆరోపించారు. దళితులు సంక్షేమ పథకాలు అడగలేదని.. విద్య, ఉపాధి అవకాశాలు కోరారని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ 1960లలోనే ఇళ్లకు పట్టాలు ఇచ్చిందని.. ఆ తర్వాత ఉపాధి హామీ, రిజర్వేషన్ వంటివి తీసుకొచ్చిందని రేవంత్ గుర్తుచేశారు. కానీ కేసీఆర్ సర్కార్ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను నడిబజార్‌లోకి నెట్టారని ఆరోపించారు.

కేసీఆర్ పాలనలో ఏ ఒక్క రైతుకైనా గిట్టుబాటు ధర, నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చిందా అని ఆయన ప్రశ్నించారు. కానీ కేసీఆర్ కుటుంబానికి అధికారం, మంత్రి పదవులు, ఫాం హౌస్‌లు, లక్షల కోట్ల సొమ్ము వచ్చాయని రేవంత్ దుయ్యబట్టారు. 4,634 ప్రాథమిక పాఠశాలలను కేసీఆర్ బంద్ చేశారని.. జూనియర్ కాలేజీలని మూసివేశారని, యూనివర్సిటీల్లో 5 ఏళ్ల నుంచి లెక్చరర్లను నియమించలేదన్నారు. ప్రైవేట్‌లో  పాలు అమ్ముకునే మల్లారెడ్డికి  యూనివర్సిటీ  ఇచ్చారంటూ రేవంత్ మండిపడ్డారు. ఎత్తుపల్ల రాజేశ్వర్ రెడ్డికి అనురాగ్ యూనివర్సిటీ అని ఇచ్చారంటూ మండిపడ్డారు.

కెకె మహేందర్ రెడ్డికి ద్రోహం చేసి సిరిసిల్లలో టిక్కెట్ కేటీఆర్‌కు టికెట్ ఇచ్చారంటూ రేవంత్ ఆరోపించారు. చంద్రబాబు నాయుడు కాళ్లు పట్టుకుంటే టీడీపీ కేటీఆర్‌ను గెలిపించిందని ఆయన ధ్వజమెత్తారు. తండ్రికి తెలియకుండానే కేటీఆర్ రాజకీయాల్లోకి వచ్చారన్న మాట అవాస్తవమన్నారు. రాహుల్ బొజ్జాని సీఎం పేషీలోకి నేనే తెచ్చానని కేటీఆర్ అంటున్నారంటూ మండిపడ్డారు.

ప్రణబ్ ముఖర్జీ, గవర్నర్ నరసింహన్ కనిపిస్తే చాలు కేసీఆర్ ఎగిరి గంతులేసి వాళ్ల కాళ్లు పట్టుకునేవారంటూ రేవంత్ సెటైర్లు వేశారు. దళితుడైన రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్రపతి హోదాలో వస్తే కాళ్లకి దండం పెట్టారా, కనీసం చేతులేత్తి నమస్కారం పెట్టారా అంటూ రేవంత్ ఫైర్ అయ్యారు. రాజీవ్ శర్మ, అనురాగ్ శర్మ, ఎస్‌కే జోషీల  పదవికాలం పొడిగించడంతో పాటు ప్రత్యేక సలహాదారులుగా నియమించుకున్న కేసీఆర్.. దళితుడైన ప్రదీప్ చంద్రను ఒకే నెలలో రిటైర్ చేసి పంపించారంటూ రేవంత్ ఎద్దేవా చేశారు. భూపాలపల్లి కలెక్టర్‌గా వున్న మురళీకి అవమానం చేస్తే ఆయన ఐఏఎస్‌కు రాజీనామా చేశారని రేవంత్ గుర్తుచేశారు. అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ .. కేసీఆర్ అవమానాలు భరించలేక రాజీనామా చేశారని తెలిపారు. దళిత, గిరిజన ఓట్లు కొల్లగొట్టడానికి కేసీఆర్ బయల్దేరారని ఆయన మండిపడ్డారు. హుజురాబాద్ దళిత బిడ్డల చేతుల్లో కేసీఆర్ చావు రాసి పెట్టి వుందన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios