పసుపు బోర్డ్ వ్యవహారానికి సంబంధించి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఫైరయ్యారు. పసుపు బోర్డును తెస్తానని బాండ్ పేపర్ పై రాసిన అరవింద్ ను... జీవితాంతం ఆ బాండ్ పేపర్లు వెంటాడుతూనే ఉంటాయని హెచ్చరించారు

నిజామాబాద్ బీజేపీ ఎంపీ (nizamabad) ధర్మపురి అరవింద్‌పై (dharmapuri arvind) టీఆర్ఎస్ (trs) ఎమ్మెల్యే జీవన్ రెడ్డి (jeevan reddy) ఫైర్ అయ్యారు. స్పైస్ బోర్డుకు రూ. 6 కోట్ల నిధులు తెచ్చానని అరవింద్ చెప్పుకుంటున్న మాటల్లో నిజం లేదని జీవన్ రెడ్డి ఆరోపించారు. అరవింద్ తెచ్చిన నిధులు రూ. 2 కోట్లకు కూడా మించలేదని ఆయన విమర్శించారు. కవిత నిజామాబాద్ ఎంపీగా ఉన్నప్పుడు ఎన్నో కోట్ల నిధులను తీసుకొచ్చారని, ఎన్నో అభివృద్ధి పనులను చేపట్టారని జీవన్ రెడ్డి గుర్తుచేశారు. అరవింద్ గెలిచి మూడేళ్లు అవుతున్నా నియోజకవర్గానికి ఆయన చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. 

అరవింద్ నోరు తెరిస్తే అన్నీ బూతులు, అబద్ధాలే మాట్లాడుతున్నారని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అరాచకాలు సృష్టించే వ్యక్తి మాదిరి తయారయ్యారని అన్నారు. పసుపు బోర్డును తెస్తానని బాండ్ పేపర్ పై రాసిన అరవింద్ ను... జీవితాంతం ఆ బాండ్ పేపర్లు వెంటాడుతూనే ఉంటాయని జీవన్ రెడ్డి హెచ్చరించారు. తమ ఎమ్మెల్సీ కవిత సంస్కారవంతంగా మాట్లాడితే, అరవింద్ మాత్రం ఏకవచనంతో సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని ఫైరయ్యారు. అవినీతిలో పుట్టి పెరిగిన అరవింద్ అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేసీఆర్ కుటుంబం గురించి పరుష పదజాలాన్ని ఉపయోగిస్తే అరవింద్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని జీవన్ రెడ్డి హెచ్చరించారు.

ఇకపోతే.. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (kalvakuntla kavitha) సైతం ఎంపీ అరవింద్‌పై విమర్శలు గుప్పించారు. బుధవారం కవిత బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎంపీగా గెలిచిన అరవింద్ మూడేళ్లలో ప్రజలకు ఏం చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి అరవింద్ గెలిచారని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నేరవేర్చలేదని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలిపించిన వ్యక్తికి పనిచేసే అవకాశం ఇవ్వాలని అన్నారు. అందుకే తాను ఇన్ని రోజులు అరవింద్ గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదని చెప్పారు. కానీ మూడేళ్లు గడుస్తున్నా ఆయన ప్రజలకు ఏం చేసింది లేదని.. అందుకే జిల్లా ప్రజలకు వాస్తవాలు వెల్లడించడానికి మాట్లాడుతున్నట్టుగా తెలిపారు. 

తాను 2014 మే నెలలో ఎంపీగా ఎన్నికైన తర్వాత అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. పసుపు బోర్డు కోసం అనేక ప్రయత్నాలు చేశానని చెప్పారు. 2014లోనే పసుపు బోర్డుపై అప్పటి వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశానని చెప్పారు. బాబా రామ్‌దేవ్‌ను కలిసి పసుపు బోర్డు ఏర్పాటుకు కృషి చేయాలని కోరినట్టుగా చెప్పారు. పసుపు బోర్డు కోసం 2016లో ప్రధాని మోదీని కలిసి విజ్ఞప్తి చేయడం జరిగిందన్నారు. 2018లో అ కేంద్ర మంత్రిని మరోసారి కలిశానని తెలిపారు. 2017లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసిందని చెప్పారు. 2017లోనే డివిజన్ ఆఫీస్ ఏర్పాటు చేశారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంతో 250 బ్రాయిలర్లను పసుపు రైతులకు అందించిందని చెప్పారు.

మూడేళ్లలో ఎంపీ అరవింద్ పార్లమెంట్‌లో ఐదుసార్లు మాట్లాడరని.. అప్పుడు పసుపు బోర్డు గురించి ప్రస్తావనే లేదన్నారు. పసుపుకు మద్దతు ధర ఇవ్వాలని కూడా కోరలేదన్నారు. ఎర్రజొన్నకు మద్దతు ధర ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. అరవింద్ పసుపు రైతుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని మండిపడ్డారు. స్పైస్ బోర్డుకు రూ. 1.92 కోట్లు మాత్రమే ఇచ్చారని చెప్పారు. అది కూడా ఓ అపార్ట్‌మెంట్‌లో పెట్టారని ఫొటోలు చూపించారు.