టీఆర్ఎస్  ట్రబుల్ షూటర్, మాజీ మంత్రి హరీష్ రావు పార్టీ వీడనున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. గత రెండు రోజులుగా ఆయన బిజెపిలో చేరడానికి సిద్దమైనట్లు ఓ ఇంగ్లీష్ వార్తాపత్రికలో కథనం వచ్చినట్లుగా ఓ పేపర్ కటింగ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇలా తనపై జరుగుతున్న ప్రచారంపై హరీష్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. 

ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచురించవద్దని హరీష్ మీడియాకు సూచించారు. '' మీడియా సంస్థలకు నా విన్నపం. ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మి ప్రచురించవద్దు. అలాగే నాపై తప్పుడు వార్తలను ప్రచురించిన మీడియా సంస్థలు వెంటనే క్షమాపణ చెప్పాలి. రేపు అదే పత్రికలో నాకు క్షమాపణలు చెబుతూ వార్తను ప్రచురించాలి'' అంటూ హరీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మరో ట్వీట్ లో '' ప్రముఖ మీడియా సంస్థలో నాపై వచ్చిన వార్తే తప్పుడు వార్తలకు మంచి ఉదాహరణ. సమాచారం లేకుండానే ఇలాంటి వార్తలను ప్రచురించడం వారి నిబద్దతను దెబ్బతీస్తుంది. తప్పుడు వార్తల ప్రచారాన్ని అడ్డుకోడానికి యావత్ దేశం పోరాడుతున్న సమయంలో ఇలాంటి వార్తలు ప్రచారం జరగడం బాధాకరం'' అంటూ హరీష్ స్పందించారు. 

గతంలోనూ ఇదేవిధంగా తనపై వచ్చిన తప్పుడు వార్తలపై హరీష్ సీరియస్ గా స్పందించారు.  టీఆర్ఎస్ పార్టీని వీడనున్నట్లు తనపై తప్పుడు ప్రచారం చేసి, పిచ్చిరాతలు రాస్తూ తన ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇలా సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కూడా డిజిపి కి ఫిర్యాదు చేశారు. తాజాగా మరోసారి అలాంటి తప్పుడు వార్తలు తనపై ప్రచారంలోకి రావడంతో హరీష్ ట్విట్టర్ ద్వారా సీరియస్ గా స్పందించారు.