టీఆర్ఎస్ నేత, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వ వివాదంపై మంగళవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా తాను జర్మనీ పౌరసత్వం వెనక్కి ఇచ్చేసినట్లు ఆయన హైకోర్టుకు తెలిపారు.

టీఆర్ఎస్ నేత, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వ వివాదంపై మంగళవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా తాను జర్మనీ పౌరసత్వం వెనక్కి ఇచ్చేసినట్లు ఆయన హైకోర్టుకు తెలిపారు. చెన్నమనేని దాఖలు చేసిన కౌంటర్‌ పిటిషన్‌పై వివరణ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం గడువు కోరింది. దీనిపై స్పందించిన న్యాయస్థానం ఇందుకు రెండు వారాల గడువు ఇచ్చింది. మరోసారి ఎవరూ గడువు కోరవద్దని తుది వాదనలకు సిద్ధం కావాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు విచారణను మరో రెండు వారాల పాటు వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.

కాగా, టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారంటూ గతంలో ఆది శ్రీనివాస్‌ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై గత కొంతకాలంగా విచారణ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఏడాది క్రితం కేంద్ర హోంశాఖ చెన్నమనేని పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కేసు విచారణ కొనసాగుతోంది.

Also Read:జర్మనీలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే, రాకపోతే సజీవదహనం అవుతా: దీక్షలో అతను

రమేష్ పౌరసత్వం వివాదంపై గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. చెన్నమనేని పౌరసత్వంపై కేంద్రానికి సంబంధం లేదని, ప్రస్తుతం ఆయన భారతదేశంలోని ఉన్నాడని తెలిపింది. రెండు దఫాలుగా ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవలు అందిస్తున్నట్లు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వలన శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం కలుగటం లేదని తెలంగాణ సర్కార్ పేర్కొంది.