టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్కసుమన్. ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రికి తీసుకెళ్లి ట్రీట్‌మెంట్ చేయిస్తే దానికయ్యే ఖర్చును తామే భరిస్తామంటూ సుమన్ చురకలు వేశారు. కేసీఆర్‌పై (kcr) ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే.. భరతం పడతామంటూ రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు.
చంచల్‌గూడ జైలులో చిప్పకూడు తిన్నప్పటి నుంచి టీపీసీసీ (tpcc) చీఫ్ రేవంత్ రెడ్డికి (revanth reddy) మెదడు పనిచేయడం లేదని దుయ్యబట్టారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్కసుమన్ (balka suman) . ఆదివారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రికి తీసుకెళ్లి ట్రీట్‌మెంట్ చేయిస్తే దానికయ్యే ఖర్చును తామే భరిస్తామంటూ సుమన్ చురకలు వేశారు.
కేసీఆర్‌పై (kcr) ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే.. భరతం పడతామంటూ రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని బీజేపీ నేతలు ఇష్టమొచ్చినట్లు తిడితే ఒక్క కాంగ్రెస్ నేత కూడా మాట్లాడలేదంటూ దుయ్యబట్టారు. మీ నాయకుడిని కాపాడుకునే శక్తి లేదా అంటూ బాల్కసుమన్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయాలకు అతీతంగా హుందాగా వ్యవహరించారని ఆయన ప్రశంసించారు. రాహుల్‌పై హిమంత బిశ్వ శర్మ.. చేసిన వ్యాఖ్యలను కేసీఆర్ ఖండించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి పద్ధతి మార్చుకోకుంటే తెలంగాణ సమాజమే బుద్ధి చెబుతుందని ఆయన జోస్యం చెప్పారు.
ఇకపోతే.. నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ కబంధ హస్తాల్లో చిక్కుకుని విలవిల్లాడుతోందన్నారు. బంగారు తెలంగాణ చేస్తామని చెప్పిన కేసీఆర్ రాష్ట్రాన్ని తన కబంధ హస్తాల్లో ఇరికించుకున్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను కొండా రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, మాణిక్ రావ్, దేవేందర్ గౌడ్ లు అభివృద్ధి చేస్తే.. పరిగి ఎమ్మెల్యే దేవుడి మాన్యాలను మింగాడని ఆయన ఆరోపించారు. చేవెళ్ల చెల్లమ్మను టీఆర్ఎస్ లో కలుపుకున్న కేసీఆర్... ఆ ప్రాంతంపై శీతకన్నేశారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అభివృద్ధి కోసం టిఆర్ఎస్ లో కలిశామన్న చేవెళ్ల చెల్లమ్మ ఎందుకు చేవెళ్ల అభివృద్ధి కోసం అడగడం లేదని ఆయన ప్రశ్నించారు.
ఈ ప్రాంతానికి రాజశేఖర్ రెడ్డి ప్రాణహిత చేవెళ్ల తెస్తే.. కిరణ్ కుమార్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి జీవో ఇచ్చారన్నారు. ప్రాణహితను చేవెళ్లకు రాకుండా అడ్డుకున్నది కేసీఆర్ కాదా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈ విషయంపై యాదగిరి గుట్టలో కేసీఆర్ ప్రమాణం చేయగలరా? అని రేవంత్ సవాల్ విసిరారు. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లను ఏ దేవుడు పాలిస్తున్నారంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
