హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ను విమర్శించే స్థాయి పొన్నంకు లేదని మండిపడ్డారు. 

కేటీఆర్ పై పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను బాల్క సుమన్‌ ఖండించారు. కేటీఆర్ బంజారాహిల్స్ లీడర్ కాదని ఆయన గ్లోబల్ లీడర్ అంటూ చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌ మహానగరానికి అంతర్జాతీయ సంస్థలను తీసుకు వచ్చింది కేటీఆర్ అని చెప్పుకొచ్చారు. 

కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేకపోయిందో చెప్పాలని బాల్క సుమన్ నిలదీశారు. అప్పుడేందుకు పొన్నం ప్రభాకర్ కృషి చేయలేకపోయారో చెప్పాలని నిలదీశారు. 

కాళేశ్వరం తరహాలోనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను కూడా పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. టీఆర్ఎస్ పై నోరు పారేసుకుంటే కాంగ్రెస్ నేతలకు కంఠశోషే మిగులుతుందని చెప్పారు ఎమ్మెల్యే బాల్క సుమన్.