హైదరాబాద్:  కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి రాజకీయ టెర్రరిస్టు, బ్లాక్ మెయిలర్ అంటూ మండిపడ్డారు. కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గ్లోబరీనా సంస్థకు టెండర్ దక్కడానికి కేటీఆర్ కారణమని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

బుధవారం నాడు టీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్‌ రెడ్డి ఓ రాజకీయ టెర్రరిస్ట్‌.. రాష్ట్రంలో ఒక శాడిస్టుగా మారాడని సుమన్‌ ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి శంకరాచార్యులకు, పీర్ల పండుగకు ముడిపెడతాడని ఆయన ఎద్దేవా చేశారు.  మోకాలికి, బోడి గుండుకు లింకు పెడతాడన్నారు. 

తక్కువ బిడ్ కోడ్ చేసినందునే ఇంటర్మీడియట్ బోర్డు గ్లోబరీనా సంస్థకు టెండర్ దక్కిందని  సుమన్ చెప్పారు. విద్యాశాఖకు సంబంధించిన ఈ వ్యవహరం ఐటీ శాఖకు ఏం సంబంధమని ఆయన ప్రశ్నించారు.  

ఆనాడూ ఐటీ మినిస్టర్‌గా ఉన్న కేటీఆర్‌కు దీన్ని అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.అడ్డగోలు ఆరోపణలు చేయడం సరికాదన్నారు సుమన్.    రేవంత్‌ రెడ్డి నోటికి అదుపు లేదు,  రాష్ట్రంలో ఒక శాడిస్ట్‌గా మారాడని సుమన్  తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యలను 24 గంటల్లో రేవంత్‌ రెడ్డి వెనక్కి తీసుకోవాలి అని సుమన్‌ డిమాండ్‌ చేశారు. 

ఇంటర్‌ ఫలితాలకు సంబంధించి జాగ్రత్తగా మాట్లాడాల్సిన ప్రతిపక్షాలు.. అపోహాలు సృష్టించి.. అనుమానాలు రేకెత్తించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. విపక్షాలు రాజకీయ ఉన్మాద రాజకీయంతో వ్యవహరిస్తున్నాయని ఆయన మండిపడ్డారు.