ప్రధాని పర్యటనలో రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆహ్వానించకపోవడం సరైంది కాదని ప్రభుత్వ విప్, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు.
ప్రధాని పర్యటనలో రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆహ్వానించకపోవడం సరైంది కాదని ప్రభుత్వ విప్, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు. గతంలో భారత్ బయోటెక్ ప్రారంభించడానికి వచ్చినప్పుడు క్రెడిట్ తనకే రావాలని ప్రధాని ఒక్కరే వెళ్లారని అన్నారు.
పీఎంవో నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రికి గెస్ట్ ఆప్ ఆనర్ గా పిలవడం ఆనవాయితీ అని,కానీ పిఎంవో నుంచి సీఎం కేసీఆర్ గారికి ఎలాంటి ఆహ్వానం అందలేదని అన్నారు. అలాగే.. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేసేందుకు విచ్చేస్తున్న ప్రధాని ప్రోటోకాల్ పాటించకుండా వ్యవహరిస్తున్నారని, సీఎం కేసీఆర్ ను కావాలని మరోసారి అవమానిస్తున్నారని మండిపడ్డారు. గతంలో రెండు సార్లు ప్రధానమంత్రి కార్యాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి కి ఆహ్వానం పంపించకుండా పర్యటనకు వచ్చారన్నారు.
ఏడాది క్రితం ఉత్పత్తి ప్రారంభించిన ఎరువుల కర్మాగారాన్ని పునఃప్రారంభించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ప్రత్యేక తెలంగాణపై ప్రధాని మోదీ వ్యతిరేకంగా ఉన్నారని... రాష్ట్రాన్ని సాధించిన సీఎంను పదే పదే అవమానిస్తున్నారన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసే మోడీ... సింగరేణిని ఆధానికి అప్పగించే కుట్ర జరుగుతుందన్నారు. ఇది కేవలం సీఎం కేసీఆర్ కే కాదు.. ఇది తెలంగాణ సమాజాన్ని అవమానించడమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పీఎం పోస్ట్ శాశ్వతం కాదని, సీఎం కేసీఆర్ ను కావాలనే కేంద్రం అవమానిస్తుందని బాల్క సుమన్ మండిపడ్డారు. తెలంగాణ పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరు బాధాకరమని, సింగరేణిని ప్రైవేటు పరం చేయమని బహిరంగంగా ప్రకటించాలని, కార్మికులకు పెన్షన్ పెంచుతామని హామీ ఇవ్వాలని అన్నారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని ప్రకటించాలని అన్నారు. రాష్ట్రానికి పది మెడికల్ కాలేజీలు ఇస్తామని ప్రకటించాలని అన్నారు.
తెలంగాణ ప్రజలపై ప్రేమ ఉంటే విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలన్నారు. మోడీ రామగుండం గడ్డపై అడుగు పెట్టాలంటే సింగరేణి కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బిజెపి చీఫ్ బండి సంజయ్ గుజరాత్ నాయకుల చెప్పులు మోస్తూ దద్దమ్మల్లా వ్యవహరిస్తున్నారన్నారు.
