టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్కసుమన్, కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా తనపై చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు సుమన్. దమ్ముంటే రాహుల్ గాంధీని ఓయూకు రమ్మను అని ఆయన సవాల్ విసిరారు
తెలంగాణ ఇస్తామని 2004లో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ మోసం చేసిందని... ఆ పార్టీ మెడలు వంచి టీఆర్ఎస్ తెలంగాణను సాధించిందన్నారు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కిరణ్ కుమార్ రెడ్డి పక్కన ఉన్న జగ్గారెడ్డికి తెలంగాణ గురించి అర్థం కాదని దుయ్యబట్టారు. 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించానని… మీ రాహుల్ గాంధీ అమేథీ నుంచి ఓడిపోయారంటూ సుమన్ ఎద్దేవా చేశారు. తాము తెలంగాణ పక్షాన పోరాడుతున్నామని… నువ్వు ఆంధ్రవాసులకు ఊడిగం చేస్తున్నావంటూ జగ్గారెడ్డిని విమర్శించారు.
తాను తలుచుకుంటే నువ్వు తిరుగుతావా…? అంటూ జగ్గారెడ్డికి సుమన్ కౌంటర్ ఇచ్చాడు. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతే కుదరదని రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డికి హెచ్చరికలు పంపారు. దమ్ముంటే రాహుల్ గాంధీని ఓయూకు రమ్మను అని ఆయన సవాల్ విసిరారు. ఉస్మానియా యూనివర్సిటీకి రాహుల్ వస్తే ముందుగా అమరవీరుల కుటుంబానికి క్షమాపణలు చెప్పాలని బాల్క సుమన్ డిమాండ్ చేస్తారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడా లేదని ఆయన దుయ్యబట్టారు. కేసీఆర్, కేటీఆర్‌లపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోం అని సుమన్ హెచ్చరించారు. ముందు కాంగ్రెస్ పార్టీని దేశంలో కాపాడుకోవాలని ఆయన హితవు పలికారు.
అంతకుముందు.. ఇటీవల కాంగ్రెస్ (congress) నాయకత్వంపై టీఆర్ఎస్ (trs) ఎమ్మెల్యే బాల్క సుమన్ (balka suman) వ్యాఖ్యలు చేయడం పట్ల టీపీసీసీ (tpcc) వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (jagga reddy) కౌంటరిచ్చారు. గల్లీలో గోలీలు ఆడుకునే బాల్క సుమన్ ఎంపీ అయ్యాడు, ఎమ్మెల్యే అయ్యాడని, కానీ ఒక్కసారి ఓడిపోతే కనుమరుగై పోతాడని ఆయన హెచ్చరించారు.
నీకు రాహుల్ గాంధీ (rahul gandhi) మీద వ్యాఖ్యలు చేసేంత దమ్ముందా? నువ్వెంత, నీ బతుకెంత? అంటూ ఫైరయ్యారు. రాహుల్ గాంధీ కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకున్నా తప్పులేదు అంటూ జగ్గారెడ్డి నిప్పులు చెరిగారు. పోలీసులు ఉంటే నిన్నెవరూ ఏమీ చేయలేరనుకుంటున్నావా... యూత్ కాంగ్రెస్ వాళ్లు వెంటాడితే నువ్వు తిరగలేవు అని ఆయన వార్నింగ్ ఇచ్చారు. పోలీసులు ఎంతసేపు ఉంటారు? ఎవరో ఒకరు వచ్చి నీ ఒళ్లు పగలగొడతారు అంటూ జగ్గారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాజకీయంగా లబ్ది పొందింది టీఆర్ఎస్ నేతల కాదా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. కానీ ప్రజలకు రిజర్వేషన్లు, రుణమాఫీ , ఉద్యోగాలు వంటి హామీలు ఇప్పటికీ అమలు కాలేదని ఆయన గుర్తుచేశారు. బాల్క సుమన్ తనను తాను ఎక్కువగా ఊహించుకుంటున్నాడని.. తెలంగాణ వచ్చింది కాబట్టే అతను ఎంపీ, ఎమ్మెల్యే అయ్యాడని జగ్గారెడ్డి అన్నారు.
