కేసీఆర్ కు ఈటల లేఖ: బండి సంజయ్ కు టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ సవాల్ (వీడియో)
మంత్రి పదవి నుంచి బర్తరఫ్ కాక ముందు ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్ కు రాసినట్లు చెబుతున్న లేఖపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పందించారు. బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కు సవాల్ విసిరారు.
హుజూరాబాద్: మంత్రి పదవి నుంచి బర్తరఫ్ కాక ముందు క్షమాపణలు కోరుతూ, తప్పులు అంగీకరిస్తూ మాజీ మంత్రి ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాశారని చెబుతున్న లేఖపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పందించారు. దానిపై బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కు సవాల్ విసిరారు.
కేసీఆర్ ఈటల రాజేందర్ రాసిన లేఖ నిజం కాదని, ఫేక్ అని చెప్పి బండి సంజయ్ హైదరాబాదులోని భాగ్యలక్ష్మి ఆలయానికి వచ్చి ప్రమాణం చేయగలరా ఆని ఆయన అడిగారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ టీఆర్ఎస్ సోషల్ మీడియా అవగాహనా సమావేశంలో బాల్క సుమన్ శనివారంనాడు మాట్లాడారు.
టీఆర్ఎస్ ను, కేసీఆర్ ను మోసం చేసిన ఈటల రాజేందర్ నేటి నుంచి ఈటల రాజేందర్ కాదు వెన్నుపోటు రాజేందర్ అని, బిజెపి రాజేందర్ అని ఆయన అన్నారు. తాను ప్రగతిభవన్ బానిసను కాదని, తెలంగాణ ప్రజలకు బానిసనని, టీఆర్ఎస్ కు కట్టుబానిసనని, చచ్చేదాకా కేసీఆర్ వెంటే ఉంటానని ఆయన చెప్పారు.
పైసల కోసం, పదవుల కోసం పూటకో వేషం మార్చేవాడిని కానని ఆయన అన్నారు. ఊసరవెల్లి లాగా రంగులు మార్చే వాడిని కానని స్పష్టం చేశారు. మంత్రి పదవి పోగానే ఈటలకు కేసీఆర్ దొర, నియంత, దెయ్యం అయ్యారా అని అడిగారు. తెలంగాణకు ద్రోహం చేసిన బిజెపిలో ఎలా చేరావని ఆయన ఈటల రాజేందర్ ను ప్రశ్నించారు. బిజెపి నాయకులు డబ్బు సంచులను, మాయమాటలను, అబద్ధపు ప్రచారాలను నమ్ముకున్నారని బాల్క సుమన్ విమర్శించారు.
"