Asianet News TeluguAsianet News Telugu

పార్లమెంట్ స్టాండింగ్‌ కమిటీల్లో టీఆర్‌ఎస్‌కు కేంద్రం షాక్.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పార్టీ ఎంపీలు..

పార్లమెంట్ స్టాండింగ్‌ కమిటీల్లో టీఆర్ఎస్ పార్టీకి కేంద్రం షాక్ ఇచ్చింది. పార్లమెంట్ స్టాండింగ్‌ కమిటీల పునర్వ్యవస్థీకరణ తర్వాత టీఆర్ఎస్ పార్టీకి.. ఒక్క పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి కూడా చైర్మన్ పదవి దక్కలేదు.

TRS loses chairmanship of parliamentary Standing committees
Author
First Published Oct 6, 2022, 4:47 PM IST

పార్లమెంట్ స్టాండింగ్‌ కమిటీల్లో టీఆర్ఎస్ పార్టీకి కేంద్రం షాక్ ఇచ్చింది. పార్లమెంట్ స్టాండింగ్‌ కమిటీల పునర్వ్యవస్థీకరణ తర్వాత టీఆర్ఎస్ పార్టీకి.. ఒక్క పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి కూడా చైర్మన్ పదవి దక్కలేదు. పరిశ్రమలశాఖ కమిటీ చైర్మన్‌గా ఉన్న కేశవరావు.. ఇక కమిటీ సభ్యునిగా కొనసాగనున్నారు. అలాగే.. నామా నాగేశ్వర్‌ రావు లైబ్రరీ కమిటీ చైర్మన్‌గా ఉండగా ఆయనను ఆర్థిక శాఖ కమిటీలో సభ్యుడిగా నియమించారు. 16 మంది ఎంపీలు టీఆర్ఎస్‌కు పార్లమెంట్ స్టాడింగ్ కమిటీలలో ఒక్క దానికైనా చైర్మన్ పదవి దక్కకపోవడంపై ఆ పార్టీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారనే.. తమపై బీజేపీ వివిక్ష చూపుతోందని ఆరోపిస్తున్నారు. 

ఇక, మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌కు కూడా ఇలాంటి పరిణామమే ఎదురైంది. ఆహారం, వినియోగదారుల వ్యవహారాలపై పార్లమెంటరీ ప్యానెల్‌కు తృణమూల్ నుంచి చైర్మన్‌గా  ఉండగా..  పునర్వ్యవస్థీకరణ తర్వాత ఏ పార్లమెంటరీ కమిటీ అధ్యక్ష పదవిని ఇవ్వలేదు.

ఇక, హోం, ఐటీ, రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఆర్థికం, ఆరోగ్యం వంటి ఆరు ప్రధాన పార్లమెంటరీ కమిటీల చైర్మన్‌ల పదవులు బీజేపీ, ఆ పార్టీ మిత్రపక్షాలకే దక్కాయి. అంతుకు ముందు హోం వ్యవహారాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమిటీలకు కాంగ్రెస్ ఎంపీలు చైర్మన్‌లుగా ఉన్నారు. కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ స్థానంలో బీజేపీ ఎంపీ, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి బ్రిజ్ లాల్ హోం వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా నియమితులయ్యారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ స్థానంలో షిండే వర్గానికి చెందిన శివసేన ఎంపీ ప్రతాప్‌రావు జాదవ్‌ను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై పార్లమెంటరీ ప్యానెల్ హెడ్‌గా నియమించారు.

ఇదిలా ఉంటే.. వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, పార్ల‌మెంటులో ఆ పార్టీ నేత విజ‌య‌సాయిరెడ్డి.. ర‌వాణా, సాంస్కృతిక‌, ప‌ర్యాట‌క శాఖ‌ల‌ పార్ల‌మెంట‌రీ స్టాడింగ్ క‌మిటీకి చైర్మ‌న్‌గా నియ‌మితుల‌య్యారు. 

Follow Us:
Download App:
  • android
  • ios