చంద్రబాబు బాటలో కేసీఆర్: టీఆర్ఎస్ నేతల గుండెల్లో రైళ్లు
సంస్కరణల విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ చంద్రబాబు బాటలో నడుస్తున్నారు. 2004లో చంద్రబాబు ఓటమి చెందినట్లుగానే కేసీఆర్ కూడా ఓటమి పాలయ్యే ప్రమాదం ఉందనే భయాందోళనలు టీఆర్ఎస్ నేతల్లో చోటు చేసుకుంటున్నాయి.
హైదరాబాద్: సంస్కరణల విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి బాటలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పయనిస్తున్నారు. రెండోసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తర్వాత కేసీఆర్ సంస్కరణలను వేగవంతం చేయడానికి పూనుకున్నారు.
చంద్రబాబు నాయుడు 1995, 2004 మధ్యకాలంలో పెద్ద యెత్తున సంస్కరణలను ప్రవేశపెట్టి అమలు చేశారు. ఆ కారణంగా టీడీపీ తదుపరి ఎన్నికల్లో ఓటమి పాలైంది. ఈ అనుభవాన్ని కొంత మంది టీఆర్ఎస్ నాయకులు గుర్తు చేసుకుంటున్నారు.
చంద్రబాబు రెండో విడత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత చేపట్టిన సంస్కరణల వల్ల 2004 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓటమి పాలైంది. చంద్రబాబు 1995లోనే సంస్కరణలను ప్రవేశపెట్టినప్పటికీ 1999 తర్వాత వాటి అమలును వేగవంతం చేశారు.
విద్యుత్తు ఛార్జీలను పెంచారు. సబ్సిడీ బియ్యం ధరను పెంచారు. ఆస్పత్రులు, ప్రభుత్వ కార్యాలయాల్లో యూజర్ చార్జీలను ప్రవేశపెట్టారు. దీంతో ప్రజలపై పెనుభారం పడింది. దాంతో టీడీపీ ఓటమి పాలు కాక తప్పలేదు.
ఆర్టీసీని ప్రైవేటీకరించడంతో పాటు పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, రెవెన్యూ శాఖల్లో సంస్కరణలను అమలు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. దానివల్లనే ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది.
చంద్రబాబు నాయుడి సంస్కరణల వల్ల ప్రజలపై నేరుగా భారం పడిందని, అయితే కేసీఆర్ సంస్కరణలు ప్రజలపై భారం పడే విధంగా ఉండవని, అవి ఉద్యోగులపై ప్రభావం చూపవచ్చు గానీ ప్రజలకు అందించే సేవల్లో ప్రమాణాలు పెరుగుతాయని కొంత మంది టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు.
ప్రజల మనోభావాలను కేసీఆర్ సరిగ్గా అంచనా వేస్తారు. అవినీతి, పనుల్లో జాప్యం వల్ల ఉద్యోగులతో ప్రజలు విసిగిపోయారని, అందువల్ల కేసీఆర్ చేపట్టే సంస్కరణల పట్ల ప్రజలు సానుకూలంగా ప్రతిస్పందిస్తారని అంటున్నారు.
హుజూర్ నగర్ శాసనసభ ఎన్నిక ఫలితమే అందుకు నిదర్శమని కూడా అంటున్నారు. ఆర్టీసీ సమ్మె కారణంగా హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఫలితం వస్తుందని అంచనా వేశారని, కానీ ప్రజలు భారీ మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిని గెలిపించారని ఉదహరిస్తున్నారు.
సంస్కరణలపై కేసీఆర్ దూకుడుగా వ్యవహరిస్తున్నారని, కేసీఆర్ విశ్వాసం, ధైర్యం ఏమిటో తెలియడం లేదని అనేవారు కూడా ఉన్నారు. సంస్కరణల వల్ల ఉద్యోగులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని, అది తప్పకుండా టీఆర్ఎస్ పై వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపుతుందని అంటున్నారు.