మేడ్చల్  పట్టణంలోని 14వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్ధిగా విజయ్ కౌన్సిలర్ పదవికి నామినేషన్ దాఖలు చేశాడు.కానీ, టీఆర్ఎస్ నాయకత్వం ఆయనకు భీ-ఫారం ఇవ్వలేదు.

ఈ వార్డు నుండి మరో వ్యక్తి కూడ టీఆర్ఎస్ తరపున నామినేషన్  దాఖలు చేశారు. అయితే  విజయ్ తనకు టిక్కెట్టు దక్కుతోందని భావించాడు. కానీ టీఆర్ఎస్ టిక్కెట్టు తనకు కాకుండా మరో వ్యక్తికి ఇవ్వడంతో మనస్తాపానికి గురైన విజయ్ బుధవారం నాడు  మేడ్చల్ అంబేద్కర్ విగ్రహం వద్  పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

అక్కడే ఉన్న పోలీసులు విజయ్‌ను నిలువరించారు.  భీ-ఫారం ఇవ్వకుండా  తన రాజకీయ జీవితాన్ని నాశనం చేశారని ఆయన ఆరోపణలు చేశారు. 

సూర్యాపేటలో టీఆర్ఎస్ నేత ఆత్మహత్యాయత్నం

సూర్యాపేటలో కూడ టీఆర్ఎస్ నేత రహీం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సూర్యాపేట పట్టణంలోని 39వ వార్డు నుండి రహీం పోటీ చేసేందుకు రంగం సిద్దం చేసుకొన్నారు. 

కానీ, సూర్యాపేటలోని 39వ వార్డు టీఆర్ఎస్ టిక్కెట్టు రహీంకు దక్కలేదు. మరో వ్యక్తికి ఈ టిక్కెట్టు కేటాయించారు. దీంతో  రహీం మనోవేదనకు గురయ్యారు. బుధవారం నాడు రహీం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

టీఆర్ఎస్ కు రెబెల్స్ బెడద ఎక్కువగా ఉంది. ఇతర పార్టీలతో పోలిస్గే టీఆర్ఎస్ లో  టిక్కెట్ల కోసం పోటీ ఎక్కువగా ఉంది. రెబెల్స్ బుజ్జగింపు కోసం పార్టీ నాయకత్వం ప్రత్యేకించి కేంద్రీకరించింది. టిక్కెట్టు దక్కనివారికి నామినేటేడ్ పదవులను కేటాయిస్తామని టీఆర్ఎస్ నాయకత్వం కూడ తేల్చి చెప్పింది.