ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీటీసీ సభ్యుడు శ్రీనివాసరావును మావోయిస్టులు మంగళవారం తెల్లవారుజామున కిడ్నాప్ చేశారు. ఇంతవరకు ఆయన ఆచూకీ లభ్యం కాకపోవడంతో కుటుంబసభ్యులు  ఆందోళన చెందుతున్నారు.

పోడు భూముల్లో సేద్యం చేస్తున్న విషయమై శ్రీనివాసరావును మావోయిస్టులు కిడ్నాప్ చేసినట్టుగా స్థానికులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో పోడు భూముల విషయమై గిరిజనులు, గిరిజనేతరుల మధ్య వివాదం సాగుతోంది.

ప్రతి ఏటా సుమారు 100 ఎకరాల్లో సేద్యం చేస్తున్నాడు.  గిరిజనులకు చెందిన భూమిని లీజుకు తీసుకొని  సాగు చేస్తున్నారు.ఐదేళ్ల పాటు శ్రీనివాసరావు ఈ భూములను లీజుకు తీసుకొన్నట్టుగా చెబుతున్నారు. నాలుగేళ్లుగా శ్రీనివాసరావు ఈ భూముల్లో  పత్తి, వరి పంటలను సాగు చేశారు.

కొత్తూరు స్థానం నుండి శ్రీనివాసరావు గతంలో ఎంపీటీసీగా పనిచేశారు. రిజర్వేషన్ కారణంగా ఈ దఫా ఆయన పోటీ చేయలేదు. శ్రీనివాసరావును కిడ్నాప్ విషయమై విచారణ చేస్తున్నట్టుగా జిల్లా ఎస్పీ సునీల్ దత్ చెప్పారు.

సుమారు 15 మంది సాయుధులైన వారు వచ్చిన తన భర్త శ్రీనివాసరావును కిడ్నాప్ చేశారని భార్య దుర్గ చెప్పారు. తన భర్తను  వదిలేయాలని తాము అడ్డుపడితే తమను కొట్టారని ఆమె చెప్పారు.

అంతేకాదు తమను గన్ చూపి బెదిరించారని ఆమె తెలిపారు. నాలుగు ట్రాక్టర్లలో గ్రామస్తులు మంగళవారం నాడు ఛత్తీస్‌ఘడ్ అడవుల్లో గాలింపు చర్యలు చేపట్టారు. కానీ, శ్రీనివాసరావు ఆచూకీ లభ్యం కాలేదు.మావోల నుండి ఎలాంటి సమాచారం రాలేదు.