కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు ఇచ్చిన మాట తప్పి మోసం చేశారని స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గానికి చెందిన సీనియర్‌ నాయకుడు రాజారపు ప్రతాప్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు టికెట్‌ రానప్పటికీ ప్రజల అభీష్టం మేరకు వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీ చేస్తానని తెలిపారు. 

ముందస్తు ఎన్నికల్లో భాగంగా అసెంబ్లీని రద్దు చేసిన కేసీఆర్.. తన పార్టీ అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేశారు. అయితే.. టికెట్ ఆశించి భంగపడ్డ వారంతా ఇప్పుడు ఒక్కొక్కరుగా తమ ఆవేదనను వెల్లగక్కుతున్నారు. తమకు టికెట్ ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి చేరిన సందర్భంగా తనకు ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు ఇచ్చిన మాట తప్పి మోసం చేశారని స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గానికి చెందిన సీనియర్‌ నాయకుడు రాజారపు ప్రతాప్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు టికెట్‌ రానప్పటికీ ప్రజల అభీష్టం మేరకు వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీ చేస్తానని తెలిపారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం ప్రకటించిన అభ్యర్థుల జాబితాలోజిల్లాలోని స్టేషన్‌ఘన్‌పూర్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే టి. రాజయ్య పేరు ఉండటంతో ప్రతాప్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి టికెట్‌ రాకపోవడంతో 2014 ఎన్నికల్లో రాజారపు ప్రతాప్‌ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 

అనంతరం 2015ఉప ఎన్నికల సందర్భంగా ప్రతాప్‌ టీఆర్‌ఎస్‌లో చేరి రాజయ్యకు మద్దతు పలికి విజయానికి సహకరించారు. ప్రతాప్‌ సేవలను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆయనకు రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్‌ వైస్‌చైర్మన్‌గా నామినేటెడ్‌ పదవి ఇచ్చారు. అయితే చైర్మన్‌ పదవి ఆశించిన ఆయన వైస్‌ చైర్మన్‌ పదవిని తిరస్కరించారు.

అప్పటి నుంచి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ 2019 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించారు. వివిధ సేవా కార్యక్రమాలు, వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ఈసారి పార్టీ టికెట్‌ తనకే వస్తుందనే ధీమాతో ఉన్నారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు హామీతోనే టీఆర్‌ఎస్‌లో చేరానని, టికెట్‌ తనకే వస్తుందని ప్రచారం చేసుకున్నారు. అయితే కేసీఆర్‌ ప్రకటించిన జాబితాలో తన పేరు లేకపోవడంతో ప్రతాప్‌ అసంతృప్తికి గురయ్యారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి ప్రజలు తనకు టికెట్‌ రానందున ఇండిపెండెంట్‌గా పోటీచేయాలని కోరుతున్నారని, ఈ విషయమై ఆలోచిస్తున్నట్లు ఆయన తెలిపారు.