Asianet News TeluguAsianet News Telugu

రాజ్యాంగాన్ని మార్చాలని మీ పార్టీనే కమిటీ వేసింది.. కేసీఆర్ కేవలం చర్చించాలన్నారు: బీజేపీపై మోత్కుపల్లి ఫైర్

కేసీఆర్ అంబేద్కర్ గురించి మాట్లాడలేదని, ఆయన రాజ్యాంగంపై చర్చ జరగాలని మాత్రమే అన్నారని టీఆర్ఎస్ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. బీజేపీ నేతలు ఎందుకు బట్టలు చింపుకుంటున్నారో అర్థం కావడం లేదని తెలిపారు. కేంద్రంలో వాజ్‌పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని మార్చాలని కమిటీ వేసిందని, అాలాంటి పార్టీ ఇప్పుడు నానాయాగీ చేస్తున్నదని మండిపడ్డారు. అసలు జై భీం అనే హక్కు వారికి లేదన్నారు.
 

trs leader mothkupally narsimhulu fire on bjp over constitution row
Author
Hyderabad, First Published Feb 4, 2022, 3:02 PM IST

హైదరాబాద్: మాజీ మంత్రి, టీఆర్ఎస్(TRS) నేత మోత్కుపల్లి నర్సింహులు(Motkupalli Narasimhulu) బీజేపీ(BJP)పై ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ ఏం అన్నాడని ప్రతిపక్ష నేతలు బట్టలు చింపుకుంటున్నారని విమర్శించారు. బీజేపీ వాళ్లయితే.. బట్టలు చింపుకుని మాట్లాడుతున్నారని ఆరోపించారు. రాజ్యాంగానికి(Constitution) ఇప్పటికే 105 సార్లు సవరణలు చేశారని వివరించారు. అవసరమైతే.. రాజ్యాంగమే మార్చుకోవాలని అంబేద్కరుడే చెప్పాడని పేర్కొన్నారు. ఇవన్నీ పక్కనపెడితే.. సీఎం కేసీఆర్(CM KCR) తన ప్రసంగంలో ఎక్కడా అంబేద్కర్ గురించి మాట్లాడలేదని అన్నారు. ఆయన కేవలం రాజ్యాంగంపై చర్చ జరగాలని అన్నారని పేర్కొన్నారు. బీజేపీ దుర్మార్గపు పార్టీ అని, ఆ పార్టీ ఏకంగా రాజ్యాంగాన్ని మార్చడానికే ఓ కమిటీ వేసిందని మండిపడ్డారు. వాజ్‌పేయి ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని మార్చాలని కమిటీ వేసిన పార్టీ బీజేపీ కాదా? అంటూ నిలదీశారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అయితే..  రాజ్యాంగంలో మార్పులు చేయాలని అన్నారని చెప్పారు. 

రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చాలని ఆనాడు వాజ్‌పేయి  కమిటీ వేశాడు.. తల ఎక్కడ పెట్టుకుంటావ్ బండి సంజయ్ అని మోత్కుపల్లి ఫైర్ అయ్యారు. అసలు అంబేద్కర్‌ను తాకే అర్హతే మీకు లేదని అన్నారు. జై భీం అనే హక్కూ లేదని తెలిపారు. అంబేద్కర్ ఆశయాలకు అనుకూలంగా దళిత జాతికి ముఖ్యమంత్రి కేసీఆర్ న్యాయం చేస్తున్నారని వివరించారు. మీరు దండలు వేసుడు కాదు.. దళిత జాతికి ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఈ ప్రభుత్వం నిర్మిస్తున్నదని తెలిపారు.

దళిత బంధు ఇస్తున్న సీఎం కేసీఆర్‌ను విమర్శిస్తున్న మీరు ఎంత దుర్మార్గులో అర్థం అవుతున్నదని అన్నారు. దళితుల మీద నిజంగా బీజేపీకి ప్రేమ ఉంటే.. దేశవ్యాప్తంగా దళిత బంధు అమలు చేయాలని, ఆ దమ్ము బీజేపీకి ఉన్నదా? అని సవాల్ విసిరారు. దళితులకు న్యాయం చేసే దమ్ము ఉన్నదా? అంటూ ప్రశ్నించారు. కేసీఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకుంటే కబర్దార్ మిస్టర్ బండి అంటూ ఆగ్రహించారు. దేశానికి స్వాతంత్ర్య  వచ్చి 75 ఏళ్లు గడిచిన.. దళితులకు ఇంకా సుఖం లేదని, అంబేద్కర్ లేకపోతే.. దళిత జాతి లేదని అన్నారు. ఈ రాజ్యాంగం వద్దనే పార్టీ బీజేపీనే అని, మతం గురించి మాట్లాడని రోజు బీజేపీకి ఉంటుందా? అంటూ విమర్శించారు. అంబేద్కర్‌ను అవమానించారని వారు అంటున్నారని, దళిత బంధు కార్యక్రమం ఒక్కటి చాలు.. దళితులపై కేసీఆర్ వైఖరి ఏమిటో తెలియడానికి అంటూ వివరించారు.

నరేంద్ర మోడీకి ప్రధానిగా ఉండే అర్హతే లేదని అన్నారు. రైతు చట్టాలపై క్షమాపణలు చెప్పినప్పుడే రాజీనామా చేయాల్సిందని పేర్కొన్నారు. అసలు కేసీఆర్ రాష్ట్రాల హక్కుల కోసం పోరాటం చేసే అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. విభజన హామీలు ఎటుపోయాయని, ఒక్క విభజన హామీ కూడా ఈ కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదని తెలిపారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. ఈ వెధవ బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఉన్నదా? లేదా? అసలు అంటూ విరుచుకుపడ్డారు. మీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు నిధులు ఇస్తే మిగతా రాష్ట్రాలు పోరాటం చేయడంలో తప్పేంటని అడిగతారు. జాతీయ స్థాయిలో ఎదుగుతున్న సీఎం కేసీఆర్‌ను తొక్కే ప్రయత్నాలే బీజేపీ చేస్తున్నదని ఆరోపించారు. 

ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు పెట్టాల్సిన అవసరం ఉన్నదని ఆయన తెలిపారు. పార్లమెంటులో రాజకీయ రిజర్వేషన్లు పెట్టాలని డిమాండ్ చేశారు. న్యాయవ్యవస్థలోనూ రిజర్వేషన్లు లేవని వివరించారు. మన హైకోర్టులో ఒక్క దళిత న్యాయమూర్తి కూడా లేడని, ఎందుకు లేడో అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. అణగారిన కులాలపై ఇంకా వివక్ష ఉన్నదని ఆయన అన్నారు. కేసీఆర్ దళిత వ్యతిరేకి అని వారు ఆరోపిస్తున్నారని, కానీ, మద్యం షాప్‌లు, మెడికల్ షాప్‌లు, ఇతర పరిశ్రమల్లో రిజర్వేషన్లు కల్పించింది కేసీఆరే కదా అని తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios