రోడ్డు ప్రమాదంలో టీఆర్ఎస్ నేత, పెద్దవంగర గ్రామ మాజీ ఉపసర్పంచ్ రాములు(42) మృతిచెందారు. రోడ్డు పక్కనే ఉన్న ట్రాలీని తప్పించబోయి రాములు మృత్యువాత పడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. శుక్రవారం సాయంత్రం   రాములు తొర్రూరు నుంచి పెద్దవంగరకు ద్విచక్రవాహనంపై వస్తున్నాడు. ఈ క్రమంలో పోలీస్‌స్టేషన్‌ సమీపంలో ధాన్యం లోడుతో ఉన్న ట్రాక్టర్‌ ట్రాలీ టైరు పంక్చర్‌ అయి రోడ్డు పక్కన ఎలాంటి హెచ్చరికలు లేకుండా నిలిపి ఉంది. దీంతో రాములు ట్రాలీని తప్పించబోయి ప్రమాదానికి గురయ్యాడు. 

తీవ్రగాయాలపాలైన రాములను గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం తొర్రూరు డివిజన్‌ కేంద్రంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్సనిమిత్తం హైదారాబాద్‌కు తరలించగా చికిత్సపొందుతూ మరణించాడు. రాములు మృతివార్త గ్రామంలో విషాదం నింపింది. కాగా.. అతని కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లి  దయాకర్ రావు వారికి హామీ ఇచ్చారు.