టికెట్ ఇవ్వలేదనే మనస్థాపంతో తాను టీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ లో చేరుతున్నానని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని టీఆర్ఎస్ నేత దానం నాగేందర్ తెలిపారు. ఇటీవల కేసీఆర్ తమ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా.. అందులో దానం పేరు లేదు. దీంతో.. ఆయన కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని, కాంగ్రెస్ నేత ఉత్తమ్ ని కలిసారంటూ ప్రచారం కూడా మొదలైంది. దీనిని దానం ఈ రోజు ఖండించారు.తనపై సామాజిక మాధ్యమాల్లో ఉద్దేశపూర్వకంగానే అసత్య ప్రచారం జరుగుతోందని మండిపడ్డారు.

తెరాస ప్రకటించిన 105 మంది జాబితాలో తన పేరు లేకపోవడంపై బాధగా లేదని... తాను ఇప్పటికే ఐదుసార్లు ఎమ్మెల్యేగా చేసినందువల్ల ఆ పదవిపై ప్రత్యేకమైన ఆసక్తి ఏమీ లేదన్నారు. ఎన్నడూ లేని విధంగా ఒక్కసారే 105 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేయడం కేసీఆర్‌కే చెల్లిందన్నారు. అభ్యర్థులను ప్రకటించిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీలోనూ అసంతృప్తి రావడం ఖాయమన్నారు.

తాను తెరాసలో బేషరతుగానే చేరానని... ఎలాంటి పదవులు ఆశించడం లేదని దానం నాగేందర్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లోనూ తెరాస ఘనవిజయం సాధించి కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రిగా పదవి చేట్టడం ఖాయమన్నారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీకి డిపాజిట్‌ రాకుండా చిత్తుగా ఓడేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని దానం అన్నారు.